శ్రీ శివ మహా పురాణము - 479
🌹 . శ్రీ శివ మహా పురాణము - 479 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 36
🌻. సప్తర్షుల ఉపదేశము - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను-
వసిష్ఠుని మాటను విని బంధువులతో భార్యతో గూడియున్న పర్వతరాజగు ఆ హిమవంతుడు ఇతర పర్వతములతో నిట్లనెను (1).
హిమవంతుడిట్లనెను-
పర్వతరాజగు ఓ మేరు పర్వతమా! సహ్య గంధమాదన మందర మైనాక వింధ్య పర్వత శ్రేష్ఠులారా! నామాటను మీరందరు వినుడు (2). వసిష్ఠుడు ఇట్లు చెప్పుచున్నాడు. నా కర్తవ్యమేమిటి? అను విషయమును మీరు విచారించి సర్వమును మనస్సులో నిర్ణయించి నాకు చెప్పుడు (3)?
పర్వతములిట్లు పలికినవి-
ఇపుడు విమర్శించి ప్రయోజనమేమి? కర్తవ్యమును అనుష్ఠించవలెను. మహాత్మా! ఈమె దేవకార్యము కొరకు మాత్రమే జన్మించినది (4). ఈమె రుద్రుని ఆరాధించినది. రుద్రుడు ఈమెతో సంభాషించినాడు. ఈమె శివుని కొరకై అవతరించినది గనుక, శివునకు ఇచ్చి వివాహమును చేయవలెను (5).
బ్రహ్మ ఇట్లు పలికెను-
మేరువు ఇత్యాది పర్వతముల ఈ మాటను విని హిమవంతుడు మిక్కలి ప్రసన్నుడాయెను. పార్వతి తన మనస్సులో నవ్వుకొనెను (6). అరుంధతి మేనకకు అనేక యుక్తులను, వివిధములగు ఇతిహాసములను చెప్పి ఆమెను ఒప్పించెను (7). అపుడు హిమవంతుని పత్నియగు మేనక తెలుసుకొని ప్రసన్నమగు మనస్సుగలదై మునులకు అరుంధతికి భోజనము పెట్టి తాను భుజించెను (8). అపుడు జ్ఞానియగు హిమవంతుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై, తొలగిన భ్రమలు గలవాడై మునులను, అరుంధతిని చక్కగా సెవించి చేతులు జోడించి ప్రీతిపూర్వకముగా నిట్లనెను (9).
హిమవంతుడిట్లు పలికెను-
సప్తర్షులారా! మహాత్ములారా! నా మాటను వినుడు. నాకు గల గర్వమంతయూ తొలగినది. ఉమాపరమేశ్వరుల చరితమును వింటిని (10). నా శరీరము, భార్యయగు మేన, కుమారులు, కుమార్తె, సాధనసంపత్తి, సిద్ధి, మరియు ఇతరము శివునకు చెందినదే గాని, మరియొకటి గాదు (11).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
23 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment