గీతోపనిషత్తు -288
🌹. గీతోపనిషత్తు -288 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 16-2
🍀 16-2. సమస్తమును నేనే ! - క్రతువు నిర్వర్తించువారు, క్రతువును చూచు వారు, క్రతు ద్రవ్యములు, క్రతు పరికరములు, క్రతు విధానము అంతయు ఈశ్వరుడే. క్రతు సంకల్పము ఈశ్వరుడే. క్రతు నిర్వహణము ఈశ్వరుడే. క్రతు ఫలము ఈశ్వరుడే. ఈశ్వరుడు కాని దేమియు లేదు. అందువలన ఈశ్వరుడగు కృష్ణ పరమాత్మ అన్నియు 'నేనే' అనుచున్నాడు. క్రతువులు, యజ్ఞములు ఆచరించువారు ఈశ్వరుని గూర్చి చేయు దీక్షాయుత కార్యమున సమస్తమును ఈశ్వరునిగనే చూడ వలెను.అలలు చూచునపుడు సముద్రమే అలగ యున్నదని గుర్తుండుట జ్ఞానము. అలల విన్యాసములో సముద్రమును మరచుట అజ్ఞానము. 🍀
అహం క్రతు రహం యజ్ఞః స్వధాహ మహ మౌషధమ్ |
మంత్రోం హ మహమే వాణ్య మహమగ్ని రహం హుతమ్ || 16
తాత్పర్యము : క్రతువును నేనే. యజ్ఞమును నేనే. ఓషధులును నేనే. మంత్రము కూడ నేనే. హోమ ద్రవ్యమును నేనే. హోమమును నేనే. అందు హుతమగు ద్రవ్యము నేనే.
వివరణము : క్రతువులు, యజ్ఞములు ఆచరించు వారు ఈశ్వరుని గూర్చి చేయు దీక్షాయుత కార్యమున సమస్తమును ఈశ్వరునిగనే చూడ వలెను. నిజమునకు క్రతువు నిర్వర్తించువారు, క్రతువును చూచు వారు, క్రతు ద్రవ్యములు, క్రతు పరికరములు, క్రతు విధానము అంతయు ఈశ్వరుడే. క్రతు సంకల్పము ఈశ్వరుడే. క్రతు నిర్వహణము ఈశ్వరుడే. క్రతు ఫలము ఈశ్వరుడే. ఈశ్వరుడు కాని దేమియు లేదు. అందువలన ఈశ్వరుడగు కృష్ణ పరమాత్మ అన్నియు 'నేనే' అనుచున్నాడు. అంతయు 'నేనే' అనుచున్నాడు. క్రతువు నందుగాని, యజ్ఞము నందుగాని తాను కాని వస్తువేదియు లేదు.
విశ్వమంతయు తానే అయినపుడు అందలి భాగములు కూడ నేనే అని తెలుపుటలో ఒక రహస్యమున్నది. మొత్తము నుండి వివరములలోనికి ప్రజ్ఞ దిగినపుడు, వివరములలో మొత్తము అదృశ్యమగును. మొత్తము నందే వివరమున్నది గనుక వివరము నందు గూడ మొత్తమును చూడవలెను. వివరమును చూచునపుడు మొత్తమును మరచుట సహజము. మరువకుండుట జ్ఞానము. అలలు చూచునపుడు సముద్రమే అలగ యున్నదని గుర్తుండుట జ్ఞానము. అలల విన్యాసములో సముద్రమును మరచుట అజ్ఞానము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment