శ్రీ శివ మహా పురాణము - 487


🌹 . శ్రీ శివ మహా పురాణము - 487 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 38

🌻. వివాహ మండపము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునిశ్రేష్ఠా! తరువాత పర్వతరాజగు హిమవంతుడు ఆనందముతో నగరమునంతనూ రంగు రంగుల శోభ కల్గునట్లు అలంకరింపజేసెను. అచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను (1). మార్గములను నీటితో కడిగి శుద్ధి చేసి విలువైన అలంకారములతో శోభిల్లునట్లు చేసిరి. ద్వారములన్నింటి యందు అరటిస్తంభములు మొదలగు మంగళ ద్రవ్యములు అలంకరింపబడెను (2). వాకిటియందు అరటిస్తంభములను పాతి పట్టు దారములతో మామిడి చిగురుల తోరణములు కట్టబడెను (3). సింహద్వారములు మల్లెల మాలలతో శోభిల్లెను. నాల్గుదిక్కుల యందు ఉంచబడిన మంగళ ద్రవ్యములతో ఆ నగరము విరాజిల్లెను (4).

గొప్ప ఆనందముతోకూడిన పర్వతరాజు గర్గుని ముందిడు కొని తన కుమార్తె వివాహము కొరకై గొప్ప ప్రభావశాలి, వర్ణింపయోగ్యమైనది, మంగళకరమైనది అగు వ్యవస్థను సమగ్రముగా చేసెను (5). విశ్వకర్మను సాదరముగా పిలిపించి మిక్కిలి విస్తీర్ణము, అతిమనోహరము అగు వివాహమండపమును నిర్మింపజేసెను (6). ఓ దేవర్షీ! అనేక శుభలక్షణములతో గూడి మహాశ్చర్యమును కలిగించే ఆ మండపము పదివేల యోజనముల విస్తీర్ణమును కలిగియుండెను (7).

ఆ నగరములోని చరాచర ప్రాణులన్నియూ సమానమగు సౌందర్యముతో మనస్సును హరించు చుండెను. సర్వత్రా అద్భుతములతో నిండియున్న ఆ నగరము అనేక చమత్కారకములగు వస్తువులతో నలరారెను (8)? అచట స్థావరములు జంగమములను సౌందర్యములో జయించినవా? లేక జంగములే స్థావరములను జయించినవా? చెప్పవలను పడదు (9). ఆ మండపమునందు జలము స్థలమును జయించినది. కుశలురగు వ్యక్తులైననూ జలస్థల భేదమును నిర్ణయించలేక పోయిరి (10). కొన్నిచోట్ల కృత్రిమ సింహములు, మరికొన్ని చోట్ల కృత్రిమ జల పక్షుల వరుసలు, ఇంకొన్ని చోట్ల కృత్రిమములగు నెమళ్లు అలంకరిపంబడి మనోహరముగా నుండెను (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Dec 2021

No comments:

Post a Comment