గీతోపనిషత్తు -292


🌹. గీతోపనిషత్తు -292🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 17-3

🍀 17-3. ప్రణవ స్వరూపుడు - ఈశ్వరుడు సృష్టికి మూలము. సృష్టి యందు ఈశ్వరుడు ప్రణవ స్వరూపుడుగ నుండును. అనగ 'ఓం' అను నాదముగ సమస్తము నందును నిండి యుండును. ఆ నాద మాధారముగనే సర్వమును నిర్మాణమగును. నాదమను మూల స్తంభము ఆధారముగ సృష్టి వలయమంతయు ఏర్పడును. మన యందలి ప్రాణ ప్రవృత్తులకు మూలమై ప్రాణ మున్నది. ప్రాణమునకు మూలమై ప్రణవ మున్నది. అనునిత్యము జరుగుచున్న ప్రణవనాదమును అంతరంగమున అనుభవించ వచ్చును. ఓంకార నాదము వినబడుటయే ఓంకార ఉచ్చారణమునకు సిద్ది.🍀

పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17

తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.

వివరణము : 'ఓంకారము నేనే' అని మరియొక ఉదాహరణ మిచ్చినాడు. ఈశ్వరుడు సృష్టికి మూలము. సృష్టి యందు ఈశ్వరుడు ప్రణవ స్వరూపుడుగ నుండును. అనగ 'ఓం' అను నాదముగ సమస్తము నందును నిండి యుండును. ఆ నాద మాధారముగనే సర్వమును నిర్మాణమగును. నాదమను మూల స్తంభము ఆధారముగ సృష్టి వలయమంతయు ఏర్పడును. ఏర్పడిన వస్తువులందు కూడ నాదమే ఆధారముగ నుండును.

మన యందలి ఈశ్వరుని మనము చేరు ప్రయత్నమున మనకు ప్రణవనాదము అనుభవమునకు వచ్చును. మన యందలి ప్రాణ ప్రవృత్తులకు మూలమై ప్రాణ మున్నది. ప్రాణమునకు మూలమై ప్రణవ మున్నది. అనునిత్యము జరుగుచున్న ప్రణవనాదమును అంతరంగమున అనుభవించ వచ్చును. ఋషులు, మునులు నిత్యము ఆ నాదమును అనుభవించుచు, దానికి మూలమైన తత్త్వమును కూడుదురు.

ఓంకార నాదము వినబడుటయే ఓంకార ఉచ్చారణమునకు సిద్ది. ఓంకారము ఏకాక్షరముగ పరబ్రహ్మము. ద్వయాక్షరిగ ప్రకృతి పురుషులు. త్రయాక్షరిగ త్రిమూర్తి తత్త్యము. ఓంకారమునందే భూత భవిష్యత్ వర్తమానములున్నవి. ఓంకారము నందే మూడు వేదములున్నవి. ఓంకారమే కర్త కర్మ క్రియ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

No comments:

Post a Comment