శ్రీ శివ మహా పురాణము - 491


🌹 . శ్రీ శివ మహా పురాణము - 491 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 39

🌻. శివుని యాత్ర - 1 🌻

నారదుడిట్లు పలికెను-

ఓ విధీ! తండ్రీ! మహాప్రాజ్ఞా! విష్ణుశిష్యా! నీకు నమస్కారము. ఓ దయానిధీ!నీవు నాకీ అద్భుతమగు గాథను వినిపించితివి (1). ఇపుడు చంద్రశేఖరుని సుమంగళమగు, సమస్త పాపరాశులను నశింపజేసే వివాహవృత్తాంతమును వినగోరుచున్నాను (2). మంగళపత్రికను పొందిన తరువాత మహాదేవుడేమి చేసెను? శంకర పరమాత్ముని ఆ దివ్యగాథను వినిపింపుము (3).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వత్సా! మహాప్రాజ్ఞా! శంకరుని పరమకీర్తిని వినుము. మహాదేవుడు మంగళ పత్రికను స్వీకరించి తరువాత ఏమి చేసెను? అను విషయమును వినుము (4). శంభుడు ఆ మంగళ పత్రికను ఆనందముతో స్వీకరించి, సంతసించిన అంతరంగము గలవాడై చిరునవ్వు నవ్వెను. వారికి ఆ ప్రభుడు సత్కారమును చేసెను (5). ఆ పత్రికను యథావిధిగా చదివించి ఆయన స్వీకరించెను. వారిని చాలా సత్కరించి పంపించెను (6). అపుడాయన సప్తర్షులతో, 'శుభకార్యమును చక్కగా నిర్వహించితిరి. ఈ వివాహము నాకు అంగీకారమే. నా వివాహమునకు రండు' అని చెప్పెను (7).

శంభుని ఆ మాటను విని వారు మిక్కిలి సంతసించిన వారై ఆయనకు నమస్కరించి ప్రదక్షిణము చేసి తమ గొప్ప భాగ్యమును కొనియాడుచూ తమ స్థానమునకు వెళ్లిరి (8). ఓ మహర్షీ! అపుడు గొప్పలీలలను ప్రదర్శించు దేవదేవుడగు ఆ శంభు ప్రభుడు వెంటనే నిన్ము స్మరించెను (9). నీవు మహానందముతో నీ పరమ భాగ్యమును కొనియాడుతూ విచ్చేసి, చేతులు జోడించి వినయము నిండిన మనస్సుతో తలవంచి నమస్కరించితివి (10). ఓ మహర్షీ! నీవు అనేక పర్యాయములు జయశబ్దములను పలికి స్తుతించితివి. నీవు శంభుని ఆదేశమును ప్రార్థించి నీ భాగ్యమును కొనియాడుకొంటివి (11).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Dec 2021

No comments:

Post a Comment