శ్రీ శివ మహా పురాణము - 492
🌹 . శ్రీ శివ మహా పురాణము - 492 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 39
🌻. శివుని యాత్ర - 2 🌻
ఓ మునిశ్రేష్ఠా! తరువాత శంభుడు హర్షముతో నిండిన మనస్సుగలవాడై లోకాచారమును ప్రదర్శించువాడై శుభవచనములతో ఆనందమును కలిగిస్తూ నీతో నిట్లనెను (12).
ఓ మునిశ్రేష్ఠా! నేను నీకు చెప్పెదను. నీవిపుడు ప్రీతితో వినుము. నీవు గొప్ప భక్తులలో అగ్రగణ్యుడవు, నాకు ప్రియుడవు. కావుననే నీకు చెప్పుచున్నాను (13). పార్వతీదేవి నీ ఆదేశముచే గొప్ప తపస్సును చేసినది. నేను సంతోషించి ఆమెను వివాహమాడెదనని వరము నిచ్చితిని (14). భక్తికి వశుడనయ్యే నేను ఆమెను వివాహమాడెదను. ఈ కార్యమును సప్తర్షులు సాధించినారు. వారు వివాహ లగ్నమును కూడా నిర్ణయించినారు (15). ఓ నారదా! ఈ నాటి నుండి ఏడవనాడు వివాహము సంపన్నము కాగలదు. నేను లోకాచారము ననుసరించి గొప్ప ఉత్సవమును చేయగలను (16).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ కుమారా! శంకర పరమాత్మ యొక్క ఆ మాటను విని, ప్రసన్నమగు మనస్సు గల నీవు ఆ ప్రభునకు నమస్కరించి ఇట్లు పలికితివి (17).
నారదుడిట్లు పలికెను -
ఇది నీ వ్రతము. నీవు భక్తులకు అధీనుడవని చెప్పెదరు. పార్వతియొక్క మనస్సులోని కోరికను తీర్చి నీవు మంచి పనిని చేసితివి (18). హే విభో! నీవు నన్ను నీ సేవకునిగా తలంచి, నాకు తగిన కార్యమునందు నియోగించుము. నాయందు దయను చూపుము. నీకు నమస్కారమగును గాక! (19)
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మహర్షీ! నీవు ఇట్లు పలుకగా, భక్తవత్సలుడగు శివశంకరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై సాదరముగా నీతో నిట్లనెను (20).
శివుడిట్లు పలికెను-
ఓ మునీ! విష్ణువు మొదలగు దేవతలను, మునులను, సిద్ధులను మరియు ఇతరులనందరినీ కూడా నామాటగా తప్పని సరిగా నీవు ఆహ్వానించుము (21). అందరు నా శాసనమునందలి ఆదరముతో ఉత్సాహవంతులై సర్వశోభలను కలిగియున్నవారై భార్యపుత్రులతో పరివారముతో గూడా ప్రీతితో వచ్చెదరు గాక! (22) ఓ మునీ! దేవతలు మొదలగు వారు ఎవరైతే ఈ వివాహమహోత్సవమునకు హాజరు కారో, వారిని నేను నా వారు అని భావించలేను (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
19 Dec 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment