గీతోపనిషత్తు -301
🌹. గీతోపనిషత్తు -301 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 19-2 📚
🍀 19-2. ద్వంద్వ స్థితులు - సృష్టియందు పరస్పర విరుద్ధమగు లక్షణములు తననుండే వెలువడుచున్నవని, తన లోనికే లయమగునని, వానికి మూలము తానేనని భగవానుడు తన సమన్వయమును ఆవిష్కరించు చున్నాడు. వచ్చిన ప్రతీది పోవచుండునని, కనపడినది అదృశ్యమగునని, అదృశ్యమైనది మరల కనపడునని ఇట్లు దృశ్యా దృశ్యములుగ సృష్టి యున్నదని తెలియజేసినాడు. 🍀
తపామ్యహ మహం వర్షం నిగృహ్లా మ్యుత్స్పజామి చ |
అమృతం చైవ మృత్యుశ్చ సదాసచ్చాహ మర్జున || 19
తాత్పర్యము : తపింపజేయువాడను నేనే. వర్షము కురిపించువాడను నేనే. వర్షము నిలుపుదల కూడ నేనే. మరణమును నేనే. అమృతత్త్వము నేనే. సద్వస్తువు నేనే. అసద్వస్తువు నేనే.
వివరణము : సృష్టి క్రీడకు ఒకటి రెండు కావలెను. ఒకదాని కొకటి ప్రతి ముఖమై నిలువవలెను. ఒక తండ్రి నుండి పుట్టిన ఇద్దరు కుమారులు ఒకరికొకరు ప్రత్యర్థులై ఆడుకొనుచుండగ, తండ్రి చూచుచు నుండును. ఆడుకొనుటకు ప్రత్యర్థి ఆవశ్యకము. నిజమునకు ఆటయందే కుమారులిద్దరు ప్రత్యర్థుల వలె వర్తింతురు. ఆట అనంతరము ఇరువురును తండ్రి కిరుప్రక్కల చేరి ఆనందింతురు. అట్లు సృష్టియందు పరస్పర విరుద్ధమగు లక్షణములు తననుండే వెలువడుచున్నవని, తన లోనికే లయమగునని, వానికి మూలము తానేనని భగవానుడు తన సమన్వయమును ఆవిష్కరించు చున్నాడు.
వచ్చిన ప్రతీది పోవచుండునని, కనపడినది అదృశ్యమగునని, అదృశ్యమైనది మరల కనపడునని ఇట్లు దృశ్యా దృశ్యములుగ సృష్టి యున్నదని తెలియజేసినాడు. ఇప్పుడు కనబడుచున్నది. ఒకప్పుడు లేదు. కొంతకాలము తరువాత ఉండదు. శరీరము నందు పుట్టక ముందు కూడ మనమున్నాము. శరీర మందున్నపుడు కనబడుచున్నాము. శరీరము పోయిన వెనుక కూడ మనమున్నాము. శాశ్వతముగనున్న మనము కనబడినపుడు పుట్టెనని, కనబడనపుడు చచ్చెనని భావింతుమే కాని, మన మెప్పుడునూ యున్నాము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
04 Jan 22
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment