శ్రీ శివ మహా పురాణము - 499


🌹 . శ్రీ శివ మహా పురాణము - 499 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 40

🌻. శివుని యాత్ర - 4 🌻

వికృతమగు ముఖము గల చండి వారిని ఎదుట నుంచుకొని కుతూహలముతో, ఆనందముతో ఉపద్రవమును సృష్టించు చున్నదైనడచెను (39). రుద్రనకు ప్రియమైన భయంకరాకారులగు పదకొండు కోట్ల రుద్ర గణములు అపుడామెను అనుసరించినవి (40). అపుడు ముల్లోకములు డమరు ధ్వనులతో, భేరీఝంకారములతో, శంఖనాదములతో నిండి పోయెను (41). మరియు కోలాహలముగ నున్న దుందుభిధ్వని జగత్తులోని అమంగళములను నశింప జేసి జగత్తును మంగళమయము చేసెను (42).

ఓ మునీ! గణముల వెనుక దేవతలు, సిద్ధులు, లోకాపాలురు మొదలగు వారందరు ఉత్సాహముతో నడిచిరి (43). ఓ మునీ! వారి మధ్యలో గరుడాసనముపై గూర్చుండి లక్ష్మీపతి వెళ్లు చుండెను. ఆయనకు ఛత్రము ధరింపబడెను. ఆయన గొప్పగా ప్రకాశించెను (44). విష్ణు పార్షదులు ఆయనను చుట్టు వారి ప్రకాశించిరి. కొందరు ఆయనకు వింజామరలను వీచు చుండిరి. ఆయన తన అలంకారముల నన్నింటినీ ధరించి యుండెను (45). అదే విధముగా నేను కూడ మార్గములో వెళ్లుచూ శోభిల్లితిని. మూర్తిని దాల్చిన వేదశాస్త్రములతో, పురాణాగమములతో నేను ప్రకాశించితిని (46).

సనకుడు మొదలగు మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, పరిచారకులు చుట్టు వారియుండగా, నేను శివుని సేవించుట యందు తత్పరుడనైతిని (47). ఐరావత గజముపై ఆసీనుడై, అనేక విభూషణములను అలంకరించుకొని యున్న సురపతి యగు ఇంద్రుడు తన సైన్యము మధ్యలో నుండి వెళ్లుచూ ప్రకాశించెను (48). శివుని వివాహమునకై మిక్కలి ఉత్కంఠతో ప్రయాణము కట్టిన అనేకులగు ఋషులు అపుడా యాత్రలో ప్రకాశించుచుండిరి (49). శాకినులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, మరియు ప్రమథ గణములు మొదలగు ఇతరులు వెళ్లిరి (50).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

04 Jan 2022

No comments:

Post a Comment