గీతోపనిషత్తు -309


🌹. గీతోపనిషత్తు -309 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -2 📚


🍀 21-2. జనన మరణ చక్రము - భోగమార్గమున పుణ్యము త్వరితగతిని క్షీణించును. భూలోకమున 30 దినముల పుణ్యము పితృలోకమున ఒక రోజు భోగముతో సమానము. అట్లే భూలోకమున ఒక సంవత్సర మంతయు చేసిన పుణ్యము దేవలోకమున ఒక రోజు భోగముతో సమానము. కనుక ఎంత పుణ్యమార్జించినను, దాని ఫలము ఊర్ధ్వ లోకము లందు శీఘ్రముగ హరింప బడి, మరల జీవులు మరణముతో కూడినటు వంటి భూలోకమున చేరుదురు. ఇది ఎంత అవివేకమగు కార్యక్రమము. 🍀

21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||

తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.

వివరణము : భోగాసక్తి గలవానికి ఎంత ఆర్జనమైనను చాలదు. భోగమార్గమున పుణ్యము త్వరితగతిని క్షీణించును. స్వదేశమున పది సంవత్సరములు సంపాదించినది. విదేశములలో ఒక సంవత్సరములో ఖర్చు కాగలదు. అట్లే మరణము గల భూలోకమున సంపాదించిన పుణ్యము పితృలోకము నందు, దేవలోకమునందు త్వరితగతిని హరింప బడును. భూలోకమున 30 దినముల పుణ్యము పితృలోకమున ఒక రోజు భోగముతో సమానము. అట్లే భూలోకమున ఒక సంవత్సర మంతయు చేసిన పుణ్యము దేవలోకమున ఒక రోజు భోగముతో సమానము.

వంద సంవత్సరములు అనుస్యూతముగ పుణ్య మొనర్చిన మానవుడు వందరోజులు మాత్రమే ఇంద్రలోక భోగము లనుభవించి మరల భూమిని చేరును. అధోలోకము నందలి పుణ్యము ఊర్ధ్వలోకముల భోగము ఇట్టి నిష్పత్తిలో నుండును. కనుక ఎంత పుణ్యమార్జించినను, దాని ఫలము ఊర్ధ్వ లోకము లందు శీఘ్రముగ హరింపబడి, మరల జీవులు మరణముతో కూడినటువంటి భూలోకమున చేరుదురు. ఇది ఎంత అవివేకమగు కార్యక్రమము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2022

No comments:

Post a Comment