శ్రీ శివ మహా పురాణము - 507


🌹 . శ్రీ శివ మహా పురాణము - 507 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 42

🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 2 🌻


ఆభరణములుగా మారి పోయిన పాములతో నిండిన దేహము గలవాడు, అద్భుతమగు అవయవ కాంతులు గలవాడు, దివ్యమగు కాంతి గలవాడు, లోకపాలకులచే వింజామరలను చేతబట్టి సేవింపబడువాడు (11), ఎడమవైపున అచ్యుతుడు గలవాడు, కుడివైపున బ్రహ్మ గలవాడు, వెనుక ఇంద్రుడు గలవాడు, ప్రక్కన వెనుక దేవతలు మొదలగు వారితో కూడి యుండువాడు అగు శివ ప్రభుని చూచిరి (12).

దేవతలు మొదలగు వారందరిచే స్తుతింపబడువాడు, లోకములకు మంగళముల నిచ్చువాడు, స్వేచ్ఛచే స్వీకరింపబడిన దేహము గలవాడు, పరబ్రహ్మ స్వరూపుడు, సర్వేశ్వరుడు, వరములనిచ్చువాడు (13), సగుణుడు, మరియు నిర్గుణుడు, భక్తుల ఆధీనములో నుండువాడు, దయను చూపువాడు, ప్రకృతి పురుషులిద్దరికీ అతీతుడు, సచ్చిదానందఘనుడు అగు శివుని చూచిరి (14).

హిమవంతుడు ఆ ప్రభువు యొక్క కుడివైపున గరుడుని అధిష్ఠించిన వాడు, అనేక భూషణములచే అలంకరించుకున్నవాడు, పాపములను హరించువాడు అగు అచ్యుతుని చూచెను (15). ఓ మునీ! ఆ ప్రభుని ఎడమవైపున నాల్గు మోములు గలవాడు, తన పరివారముతో గూడి అధికముగా శోభిల్లువాడునగు నన్ను చూచెను (16).

శివునకు సదా మిక్కిలి ప్రియులైన ఈ దేవతోత్తములనిద్దరినీ చూచి హిమవంతుడు పరివారముతో గూడి సాదరముగా వారికి ప్రణమిల్లెను (17). పర్వత రాజగు హిమవంతుడు శివునకు ఇరువైపుల, ప్రక్కల యందు విరాజలిల్లుతున్న దేవతలు మొదలగు వారిని చూచి ప్రణమిల్లెను (18). హిమవంతుడు శివుని ఆజ్ఞచే ముందు నడుస్తూ తన నగరమునకు దారితీసెను. విష్ణవు, బ్రహ్మ వెంటనే మునులతో దేవతలతో గూడి వెనుక నడిచిరి (19).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


20 Jan 2022

No comments:

Post a Comment