గీతోపనిషత్తు -310


🌹. గీతోపనిషత్తు -310 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -3 📚

🍀 21-3. జనన మరణ చక్రము - పుణ్య వ్యయమునకు కాలము శీఘ్రమై యున్నది. పుణ్యమార్జించుటకు కాలము అతి నెమ్మదిగ గోచరించును. ఆరు గంటలు వరుసగ పని చేయుటకును, ఆరు గంటలు నిద్రించుటకును గల వ్యత్యాసమే పుణ్యమార్జించుటకును, వెచ్చించుటకును గల వ్యత్యాసము. వంద సంవత్సరముల శ్రమకు మూడు నెలల పదిరోజుల అనుభూతి! ఇది తెలియక స్వర్గసుఖములు కోరువారు అనంత కాలము శ్రమపడుచు నుందురు. ఇది నిజమునకు లాభసాటి వ్యాపారము కాదు. కామ్యకర్మ మార్గమిట్లే యుండును. 🍀


21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||

తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.

వివరణము : వంద సంవత్సరముల శ్రమకు మూడు నెలల పదిరోజుల అనుభూతి! ఇది తెలియక స్వర్గసుఖములు కోరువారు అనంత కాలము శ్రమపడుచు నుందురు. ఇది నిజమునకు లాభసాటి వ్యాపారము కాదు. కామ్యకర్మ మార్గమిట్లే యుండును. భోగమున మార్గమిట్లే యుండును. నిజమునకు సుఖము నందు కాలము త్వరితగతిని సాగు చున్నట్లుండును. దుఃఖమునందు నిదానముగ సాగుచున్నట్లు వుండును. సుఖముగ కూర్చుండి పరిహాసముతో భాషణము సాగు చున్నపుడు కాలము క్షణములో అయిపోయినట్లుండును.

విషయాసక్తితో భాషణమున పడినవారికి కాలము తెలియదు. కాని వేదనతో బాధ పడుచున్న వారికి ప్రతి నిమిషము ఒక జామువలె నుండును. సరస సంభాషణము లందు జాము ఒక క్షణముగ గడచిపోవును. పుణ్య వ్యయమునకు కాలము శీఘ్రమై యున్నది. పుణ్యమార్జించుటకు కాలము అతినెమ్మదిగ గోచరించును. ఆరు గంటలు వరుసగ పనిచేయుటకును, ఆరు గంటలు నిద్రించుటకును గల వ్యత్యాసమే పుణ్యమార్జించుటకును, వెచ్చించుటకును గల వ్యత్యాసము. కనుక దివ్య భోగములు కోరుట అవివేకమని తెలిసిన యోగులు, ఋషులు దైవయోగము నాశ్రయించిరి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


22 Jan 2022

No comments:

Post a Comment