శ్రీ శివ మహా పురాణము - 508
🌹 . శ్రీ శివ మహా పురాణము - 508 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 42
🌻. పెళ్లి వారికి ఎదురేగుట - 3 🌻
ఓ నారదా! మునులు, దేవతలు, ఇతరులు సర్వులు శివునితో బాటు వెళ్లు చున్నవారై, హిమవంతుని నగరమునకు పెక్కు భంగుల కొనియాడ జొచ్చిరి (20).
హిమవంతుడు దేవతలను, ఇతరులను తీర్చిదిద్దిన సుందరమగు శిఖరముపై నిలిపి, వివాహ వేదిక ఉన్న స్థలమునకు వెళ్లెను (21). నాల్గు స్తంభములతో తోరణములతో కూడి యున్న ఆ వేదికను పరీక్షించెను (22). మరియు పర్వతశ్రేష్టుడగు హిమవంతుడు తన పుత్రులను విష్ణువు మొదలగు వారందరితో కూడియున్న శివుని సమీపమునకు పంపెను (23). మహానందముతో కూడియున్న వాడు, బంధువులందరితో కలసి యున్నవాడు అగు పర్వతరాజు వరుని ఆహ్వానించే కార్యమును మహోత్సవముగా చేయదలంచెను (24).
అపుడా హిమవంతుని పుత్రులు అచటకు వెళ్లి తన వారితో కూడి యున్న శివునకు ప్రణమిల్లి హిమవంతుని ఆ ప్రార్థనను గురించి చెప్పిరి (25). అపుడా హిమవంతుని పుత్రులు శివుని ఆజ్ఞను బొంది తమ గృహమునకు వెళ్లి శివుడు, ఇతరులు వచ్చుచున్నారని ఆనందముతో పర్వత రాజగు హిమవంతునకు చెప్పిరి (26). ఓ మహర్షీ! విష్ణువు మొదలగు దేవతలు, మరియు శివుడు హిమవంతుని ఆ ప్రార్థనను విని మిక్కిలి ఆనందించిరి (27). దేవతలు, మునులు, గణములు అందరు చక్కని వేషములను ధరించి శివునితో కలిసి హిమవంతుని గృహమునకు వెళ్లిరి (28).
ఆ సమయములోమేన శివుని చూడ గోరెను. ఓ మునీ! ఆమె హిమవంతుని సేవకుని చే మహర్షి శ్రేష్ఠుడవగు నిన్ను పిలిపించెను (29). ఓ మునీ! శివుడు వెళ్లుమని నిన్ను ప్రేరేపించెను. శివుని హృదయములోని ఆకాంక్షను పూర్ణము చేయగోరి నీవు వెళ్లితివి (30). శంకర ప్రభుని గర్వాపహారకమగు రూపమును చూడగోరినది, విస్మయమును పొందిన మనస్సు గలది అగు మేన నీకు నమస్కరించి ఇట్లు పలికెను (31).
శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో దేవగిరుల కలయిక అనే నలుబది రెండవ అధ్యాయము ముగిసినది (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
22 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment