శ్రీ శివ మహా పురాణము - 500


🌹 . శ్రీ శివ మహా పురాణము - 500 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 40

🌻. శివుని యాత్ర - 5 🌻

సనకుడు మొదలగు మహాసిద్ధులు, ప్రజాపతులు, పుత్రులు, పరిచారకులు చుట్టు వారియుండగా, నేను శివుని సేవించుట యందు తత్పరుడనైతిని (47). ఐరావత గజముపై ఆసీనుడై, అనేక విభూషణములను అలంకరించుకొని యున్న సురపతి యగు ఇంద్రుడు తన సైన్యము మధ్యలో నుండి వెళ్లుచూ ప్రకాశించెను (48).

శివుని వివాహమునకై మిక్కలి ఉత్కంఠతో ప్రయాణము కట్టిన అనేకులగు ఋషులు అపుడా యాత్రలో ప్రకాశించుచుండిరి (49). శాకినులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు, మరియు ప్రమథ గణములు మొదలగు ఇతరులు వెళ్లిరి (50).

తుంబురుడు, నారదుడు, హాహా, హూహూ మొదలగు గంధర్వ శ్రేష్ఠులు, కిన్నరులు వాద్యములను మ్రోయించుచూ ఆనందముతో ముందునకు సాగిరి (51). సవితృమండలాధిష్ఠాన దైవమగు గాయత్రి, లక్ష్మి అను జగన్మాతలు, దేవకన్యలు, ఇతర దేవతాస్త్రీలు వచ్చిరి (52).

జగత్తునకు తల్లులైన ఇతర దేవభార్యలు శంకరుని వివాహమను కారణముచే ఆనందముతో అందరు విచ్చేసిరి (53). శుద్ధస్పటికమువలె తెల్లనిది, సర్వాంగ సుందరమైనది, వేదశాస్త్రములచే సిద్ధులచే మహర్షులచే ధర్మ మూర్తి యని కొనియా డబడినది అగు వృషభమును (54) ధర్మ ప్రేమియగు మహాదేవుడు అధిష్ఠించెను. దేవతలచే, ఋషులచే, ఇతరులందరిచే సేవింపబడుతూ పయనించుచున్న శంకరుడు మిక్కిలి ప్రకాశించెను (55).

పూర్ణముగా అలంకరింపబడిన మహేశ్వరుడు పార్వతీ దేవితో వివాహము కొరకై హిమవంతుని గృహమునకు వెళ్లుచున్న వాడై ఈ ఋషులందరితో గూడి ప్రకాశించెను (56). శివుని పరమోత్సవ యాత్రను ఇంత వరకు వర్ణించి యుంటిని. ఓ నారధా! హిమాలయ నగరములో జరిగిన చక్కని వృత్తాంతమును వినుము (57).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివ యాత్రా వర్ణన మనే నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


06 Jan 2022

No comments:

Post a Comment