శ్రీ శివ మహా పురాణము - 501


🌹 . శ్రీ శివ మహా పురాణము - 501 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 41

🌻. వివాహ మండపము -1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునీ! అపుడు విష్ణువు ఇతరులతో సంప్రదించి శంకరుని ఆజ్ఞను పొంది ముందుగా నిన్ను హిమవంతుని గృహమునకు పంపెను (1). ఓ నారదా! హరిచే ప్రేరితుడవైన నీవు సర్వేశ్వరునకు నమస్కరించి ముందుగా హిమవంతుని గృహమునకు ఆనందముతో వెళ్లితివి (2). ఓ మునీ! నీవచటకు వెళ్లి విశ్వకర్మచే రచింపబడిన నీ కృత్రిమ మూర్తిని గాంచి సిగ్గును, ఆశ్చర్యమును పొందితివి(3). మహార్షీ! అలసి యున్న నీవు విశ్వకర్మచే నిర్మింపబడిన నీయొక్క కృత్రిమ మూర్తిని చూస్తూ నిలబడి యుంటివి (4).

ఓ మునీ! నీవు ఆ హిమవంతుని యెక్క, రత్నములతో పొదుగబడినది, బంగరు కలశములతో కూడి యున్నది, అరటి చెట్లు మొదలగు అలంకారములతో మిక్కిలి శోభిల్లునది (5), వేయి స్తంభములు గలది, అనేక రంగులు గలది, పరమాశ్చర్య కరమైనది అగు వివాహ మండపమును ప్రవేశించి వేదికను చూచి విస్మయమును పొందితివి (6). ఓ నారదమునీ! అట్టి నీవు మనస్సులో గొప్ప విస్మయమును పొంది, జ్ఞానము తొలగుటచే విమోహితమైన బుద్ధి గలవాడవై ఆ పర్వతరాజుతో ఇట్లంటివి (7).

విష్ణువు మొదలగు దేవతలు వచ్చి యున్నారా యేమి? మరియు మహర్షులు, సిద్ధులు, ఉపసురులు అందరు విచ్చేసినారా? (8). మహాదేవుడు వృషభమునధిష్ఠించి గణములచే పరివేష్టింప బడిన వాడై వివాహము కొరకు వచ్చియున్నాడా యేమి? ఓ పర్వత రాజా! సత్యమును పలుకుము (9). ఓ మునీ! విస్మయముతో నిండిన మనస్సు గల నీ ఈ మాటను విని ఆ హిమవంతుడు నీతో సత్యవాక్యము నిట్లు పలికెను (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


08 Jan 2022

No comments:

Post a Comment