మైత్రేయ మహర్షి బోధనలు - 54


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 54 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 41. అహంకార వలయము - 2 🌻

అహంకారినెట్లు గుర్తించవలెనో తెలుసుకొనుము. అతడు ఎట్టి సలహాలను పాటింపడు. ఏదియు తన తప్పని ఒప్పుకొనడు. తానేమి చేసినను ఒప్పే, తప్పు ఇతరులది. ఇట్టి అహంకారులను గుర్తించి వారినుండి తప్పించుకొని పనులు చేసుకొనుటయే సజ్జనుల కర్తవ్యము. కారణము లేకయే మా బృందసభ్యుని అహంకారులు ద్వేషింతురు. అవమానింప జూతురు. అతడు చేయు నిర్మలమైన బోధనలను అవహేళన చేయుదురు. అతడు వెలుగునకు ప్రతినిధి కావున తెలియకయే వారికి అతని యందు భయమేర్పడి భయము ద్వేషముగ మారును. అతని ఉనికి వారికి అసౌకర్య మనిపించును. సంఘమున అతని పెరుగుదల వారి ఈర్ష్యను రగుల్కొలుపును.

అతనిని (మా సోదరుని) తమ వానిగ చేసుకొనుటకు ప్రయత్నింతురు. కుదరనిచో కష్టపెట్టుదురు. ఇట్టి అహంకారులు సంఘమున పెరుగకుండుటకు విద్యాలయములే సరియైన పరిష్కారములు. అధ్యాపకులు నిరహంకారులై విద్యార్థులను నిరహంకారులుగ చిన్నతనము నుండియు తయారుచేయవలెను. పిల్లలకు అహంకారము వలన కలుగు కష్టనష్టములను తెలియ జేసి, సంఘమున అహంకారులను గుర్తించు తెలివినిచ్చి కాపాడ వలెను. ప్రకృతి నిర్వర్తించుచున్న రసాయనమునకు సంబంధించిన వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, మానవ నిర్మాణ శాస్త్రము చిన్నతనము నుండి బోధించి వినయవంతులను చేయవలెను. పిల్లలను స్వంత ముగ ఆలోచించు అవకాశమును వీలున్నంత పెంపొందింపవలెను.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


07 Jan 2022

No comments:

Post a Comment