🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 57 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 44. పరహితము - మోక్షము🌻
ఇద్దరు నావికులు పడవలో పోవుచుండగ పడవకు చిల్లుపడి మునిగెను. ఇద్దరును సముద్రములో రోజుల తరబడి యీదుచూ, తేలుచూ ఒక జనసంచారము లేని ద్వీపమును చేరిరి. ఆకలిదప్పులతో, భయముతో ప్రపంచమునకు దూరమై ప్రపంచము కొఱకై తపించు చుండిరి. కొన్ని దినములకు ఒక ఓడ అటుపోవుచుండగ నానా విధముల శ్రమపడి ఓడవారిని ఆకర్షించిరి. ఓడను ద్వీపమునకు మరలించి వారిద్దరిని ఓడలోనికి ఎక్కించుకొని స్వదేశమేగిరి. వారెంతయో ఆనందోత్సాహముతో తమ వారితో గడిపిన వెనుక మరల స్వచ్ఛందముగ ఆ ద్వీపమున కేగిరి. అచటనొక దీప స్తంభమును (Light house) ఏర్పరచి వచ్చు పోవు ఓడలకు సూచన లిచ్చుచు, సముద్రములోని రాళ్ళచే ఓడలు పగలకుండ కాపాడు చుండిరి. ఇదివరకు ఆ ద్వీపమున వారు దుఃఖపూరితులై సహాయము కొఱుకు తపనతో ఎదురు చూచుచుండిరి.
ఇప్పుడు అదే ద్వీపమున సంతోషముతో పలురకములుగ ప్రయాణము చేయువారికి తగు సూచనలు, సహకారము అందించుచు ఆనందముగ జీవించుచుండిరి. ఇదివరకు ఆ ద్వీపమున దుఃఖపడుటకును, ఇప్పుడు అదే ద్వీపమున ఆనందముగ నుండుటకును ఏమి కారణము? ఇదివరకు వారు ఒంటరులు, అనాధలు, ఇతర ప్రపంచముతో సంబంధము లేక అలమటించిన వారు. ఇపుడు వారు ఒంటరులు కారు, అనాధలు కారు. ఇతర ప్రపంచముతో సత్సంబంధములు ఏర్పరచుకొని పరహిత కార్యములను చేయుచున్నారు. మీ స్థితియు దాదాపుగ ద్వీపమున వేరుపడిన వారి స్థితియే. అందులకే భూమి జీవనము మీకు దుఃఖపూరితముగ గోచరించి, మోక్షము! మోక్షము! అని కేకలు పెట్టుదురు. దివ్య లోకములతో సంబంధము ఏర్పడినచో, యిక మోక్షమును గూర్చిన ఏడుపు యుండదు. ఇచ్చటనే దివ్యకార్యములను నిర్వర్తించుచూ ఆనందించ గలరు.మేము ప్రస్తుతము చేయుచున్నదదియే! మీరును ఈ మార్గమును ఎన్నుకొనవచ్చును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
13 Jan 2022
No comments:
Post a Comment