గీతోపనిషత్తు -315


🌹. గీతోపనిషత్తు -315 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -4 📚


🍀 22-4. అభియుక్తుడు - అన్యచింతన క్రమముగ అదృశ్యమై, అనన్యమగు ఈశ్వరుని దర్శించుట సిద్ధింపవలెను. అప్పుడు సాధకుని ప్రజ్ఞ అంతట నిండియున్న ఈశ్వరునికి దగ్గరగ చేరి వసించుట యుండును. నామ రూపముల కతీతమైన ఈశ్వరుని, నామ రూపముతో పరిమితము చేసుకొనుట వలన సాధకుని బుద్ధి కూడ పరిమితమగును. అట్టి వారి యందు భేద భావమెక్కువ. సత్యదర్శనము మృగ్యము. 🍀

22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమములను నేను వహించుచున్నాను.

వివరణము : అన్యచింతన క్రమముగ అదృశ్యమై, అనన్యమగు ఈశ్వరుని దర్శించుట సిద్ధింపవలెను. పై విధముగ సమస్తమును ఈశ్వరునిగనే చింతించు వానికి ఈశ్వర ఉపాసనము జరుగును. అనగా వస్తువులతోను, జీవుల తోను సంబంధము కాక అన్నిటి యందున్న ఈశ్వరునితో సంబంధము పెరుగును. ఇట్లేశ్వర సంబంధము పెరుగగ, సాధకుని ప్రజ్ఞ అంతట నిండియున్న ఈశ్వరునికి దగ్గరగ చేరి వసించుట యుండును. దగ్గరగ వసించి యుండుట ఉప ఆసనము అని అందురు.

ఏదో ఒక రూపమునకు, నామమునకు పరిమితమైన సాధకుడు ఇతరమునంతను దైవముగ దర్శించడు. అతనికి దైవమనగా తాను పరిమితము చేసుకొన్న నామము, రూపమే. ఇతర మంతయు దైవ హీనమై యుండును. అట్టి మూర్ఖులే సృష్టి యందు అసంఖ్యాకములై యున్నారు. నామ రూపముల కతీతమైన ఈశ్వరుని, నామ రూపముతో పరిమితము చేసుకొనుట వలన సాధకుని బుద్ధి కూడ పరిమితమగును. అట్టి వారియందు భేద భావమెక్కువ. సత్యదర్శనము మృగ్యము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


01 Feb 2022

No comments:

Post a Comment