శ్రీ శివ మహా పురాణము - 513


🌹 . శ్రీ శివ మహా పురాణము - 513 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 43


🌻. శివుని అద్భుత లీల - 5 🌻


నారదుడిట్లు పలికెను -

ఓ సుందరీ! ఎవని కొరకై పార్వతి అడవిలో అతి తీవ్రమగు తపస్సును చేసినదో, ఆ శంకుడీతడే. నీవు ప్రత్యక్షముగా చూడుము (48).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నీవు ఇట్లు పలుకగా ఆ మేన ఆనందముతో, అద్భుతమగు ఆకారము గలవాడు, అద్భుతులగు అనుచరులు గలవాడు, ఆశ్చర్యకరుడు అగు ఆ ప్రభుని దర్శించెను (49). అంతలో మహాద్భుతము, భూతప్రేతాదులతో కూడినది, అనేక గణములతో కూడు కున్నది అగు రుద్రసేన వచ్చెను (50). కొందరు తుఫాను వలె మహాశబ్దమును చేయుచుండిరి. మరికొందరు జెండాల రెపరెపల వంటి శబ్దమును చేయుచుండిరి. వారిలో కొందరు ఏనుగు తుండము కలిగి యుండిరి. మరి కొందరు ఏనుగు తుండము కలిగి యుండిరి. మరి కొందరు వికృతరూపమును దాల్చి యుండిరి (51). కొందరు భయంకరాకారులు, మరికొందరు కుంటివారు, మరికొందరు గ్రుడ్డివారు. కొందరు దండమును, పాశమును, మరికొందరు రోకలిని ధరించి యుండిరి (52).

కొందరి వాహనములు వెనుకకు నడుచుచున్నవి. కొందరు కొమ్ము బూరాలను ఊదుచుండిరి. కొందరు డమరుకములను, మరికొందరు గోముఖములను వాయించుచుండిరి (53). కొందరిచేతులు వికృతముగానుండెను. మరికొందరు గణములకు అనేకములగు చేతులు ఉండెను (54). కొందరికి కళ్లు లేవు. కొందరికి అనేకములగు కళ్లు ఉండెను. కొందరికి తలలు లేవు. మరికొందరి తలలు వికృతముగ నుండెను. కొందరికి చెవులు లేవు. మరికొందరికి చాల చెవులు గలవు. ఆ గణములు వివిధ వేషములను ధరించిరి (55). ఓ కుమారా! వికృతమగు ఇట్టి ఆకారములు గలవారు, బలశాలురు, మహావీరులు, భయమును గొల్పువారు అగు ఆ గణములు లెక్క లేనంత మంది ఉండిరి (56).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


01 Feb 2022

No comments:

Post a Comment