గీతోపనిషత్తు -319
🌹. గీతోపనిషత్తు -319 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 23 -2 📚
🍀 23-2. త్రికరణశుద్ధి - దైవము సర్వవ్యాపి. సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. అతడు సర్వజీవుల నధిష్టించి వారి హృదయములలో నున్నాడు. అన్నిట, అంతట, అన్ని కాలముల యందు తెలియబడు ఈశ్వరుని ఒక ప్రదేశమునకు, ఒక కాలమునకు, ఒక రూపమునకు పరిమితము చేయుట మనోవికాసము లేనివారు మాత్రమే చేయుదురు. అట్టివారు గూడ శ్రద్ధ భక్తి కలిగి త్రికరణ శుద్ధితో భజించి నపుడు, ప్రార్థించినపుడు తాను ప్రసన్నుడై వారి మార్గదర్శకత్వము వహింతునని పరమాత్మ సూచించు చున్నాడు. భక్తితోపాటు జ్ఞానము కూడ వికసింపవలెను. జ్ఞానము లేని భక్తి మూఢత్వము కలిగించును. 🍀
23. యో వ్యన్య దేవతాభక్తా యజంతే శ్రద్ధయాన్వితా: |
తే2 పి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకమ్ ||
తాత్పర్యము : విధి పూర్వకము కాకున్నను, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఇతర దేవతలను ఆరాధించుచున్నారో, వారు కూడ నన్నే ఆరాధించు చున్నారు.
వివరణము : ఉన్నది ఒకే దైవము. అన్ని రూపములు అతని నుండే ఏర్పడినవి. అన్ని నామములు కూడ అతని నుద్దేశించినవే. అతడు సర్వవ్యాపి. సర్వజ్ఞుడు. సర్వశక్తిమంతుడు. అతడు సర్వజీవుల నధిష్టించి వారి హృదయములలో నున్నాడు. అన్నిట, అంతట, అన్ని కాలముల యందు తెలియబడు ఈశ్వరుని ఒక ప్రదేశమునకు, ఒక కాలమునకు, ఒక రూపమునకు పరిమితము చేయుట మనోవికాసము లేనివారు మాత్రమే చేయుదురు.
వీరి మూలము గనే మతకల్లోలములు, యుద్ధములు పుట్టును. అట్టివారు గూడ శ్రద్ధ భక్తి కలిగి త్రికరణ శుద్ధితో భజించి నపుడు, ప్రార్థించినపుడు తాను ప్రసన్నుడై వారి మార్గదర్శకత్వము వహింతునని పరమాత్మ సూచించుచున్నాడు. భక్తితోపాటు జ్ఞానము కూడ వికసింపవలెను. జ్ఞానము లేని భక్తి మూఢత్వము కలిగించును. కనుక భక్తి శ్రద్ధలతో ఆరాధనము సలుపువారికి దైవము జిజ్ఞాస కలిగించును. జ్ఞానమునందాసక్తి కలిగించును. జ్ఞాన సముపార్జనము జరుగుచుండగ భగవంతుని స్వరూప స్వభావములు, లక్షణములు క్రమముగ భక్తునికి అవగతమగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment