🌹 . శ్రీ శివ మహా పురాణము - 517 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 44
🌻. మేన యొక్క మంకు పట్టు - 3 🌻
నారదుడిట్లు పలికెను -
శివుని యథార్థమగు సుందరరూపము నీకు తెలియనిది కాదు. ఆయన ఈ రూపమును లీలచే ధరించినవాడు. ఇది వాస్తవరూపము కాదు (26). ఓ పతివ్రతా! కావున నీవు కోపమును విడిచి స్వస్థురాలవు కమ్ము. మొండి పట్టుదలను వీడి కార్యమును నడిపించుము. పార్వతిని శివునకు ఇమ్ము (27).
బ్రహ్మ ఇట్లు పలికెను -
నీ ఆ మాటను విని ఆ మేన నీతో 'లెమ్ము, ఇచటినుండి దూరముగా పొమ్ము; నీవు దుష్టుడవు, అధమాధముడవు' అని పలికెను (28). ఆమె ఇట్లు పలకగా ఇంద్రాది సకల దేవతలు, దిక్పాలకులు వరుసగా వచ్చి ఇట్లు పలికిరి (29).
దేవతలిట్లు పలికిరి -
ఓ మేనా! నీవు పితరుల కుమార్తెవు. మా మాటను ప్రీతితో వినుము. ఈయన సాక్షాత్తుగా పరమానందము నొసగు పరమ శివుడు (30). నీ కుమార్తె మిక్కిలి దుస్సహమగు తపస్సును చేయగా, మంచి భక్తుల యందు ప్రేమ గల శంభుడు దయతో దర్శనమును, వరమును ఇచ్చి యున్నాడు (31)
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు మేన చాల సేపు దుఃఖించి, 'భయం కరాకరుడగు కైలాసపతికి నేను కన్యను ఈయను' అని పలికెను (32). ఓ దేవతలారా! మీరందరు యోజన చేసి ఈ పార్వతి యొక్క పరమ సౌందర్యమును వ్యర్థము చేయుటకు ఏల పూనుకొంటిరి? (33) ఓ మహర్షీ! ఆమె ఇట్లు పలుకగా, వసిష్ఠుడు మొదలగు సప్తర్షులు ముందుకు వచ్చి ఇట్లు పలకిరి (34).
సప్తర్షులిట్లు పలికిరి -
హిమవత్పత్నీ! నీవు పితృ దేవతల కుమార్తెవు. నీ కార్యమును సాధించుటకై మేము వచ్చితిమి. మేము చెప్పిన వచనములలో విరోధము మాకు తోచుట లేదు (35). శంకరుని దర్శనము సర్వోత్కృష్టమైన లాభము. ఆయన నీ దానమును స్వీకరించుటకై నీ గృహమునకు వచ్చి యున్నాడు (36). వారిట్లు పలుకగా జ్ఞానవిహీనురాలగు మేన మునుల వాక్యమును వమ్ము చేసి కోపముతో ఆ ఋషులకు ఇట్లు బదులిడెను (37)
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
09 Feb 2022
No comments:
Post a Comment