శ్రీ శివ మహా పురాణము - 519


🌹 . శ్రీ శివ మహా పురాణము - 519 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 5 🌻


మేన ఇట్లు పలికెను -

ఓ నాథా! నా మాటను విని నేను చెప్పినట్లు చేయుము. ఈ నీ కుమార్తె యగు పార్వతిని తీసుకు వెళ్లి కంఠము నందు బంధించి (48), శంకలేని వాడవై క్రిందకు త్రోసివేయుము. నేను ఆమెను శివునకు ఈయను. లేదా, ఓ నాథా! ఈమెను సముద్రములో ముంచి వేయుము. ఓ పర్వతరాజా! అపుడు నీకు సుఖము కలుగును. ఓ స్వామి! నీవు నీ పుత్రికను వికట రూపుడగు రుద్రునకిచ్చినచో నేను నిశ్చయముగా దేహత్యాగము చేసెదను (49, 50).

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడచట మేన మొండి పట్టుదలతో ఇట్లు పలుకగా, పార్వతి స్వయముగా వచ్చి రమ్యముగా నిట్లు పలికెను (51).

పార్వతి ఇట్లు పలికెను -

తల్లీ! నీకు అశుభములను కలిగించే విపరీత బుద్ధి పుట్టినది. ధర్మమును అవలంబించిన నీవు ఇపుడు ధర్మము నేల వీడుచున్నావు? (52) ఈ రుద్రుడే పరమాత్మ యనియు, సర్వకారణుడగు ఈశ్వరుడేననియు, సుఖమును ఇచ్చువాడనియు, అందమైన రూపము గలవాడనియు వేదములన్నియు వర్ణించుచున్నవి. (53).

అమ్మా | ఈ శంకరుడు మహేశ్వరుడు, సర్వదేవతలకు ప్రభువు, జగన్నాథుడు, అనేక రూపములను ధరించు వాడు, విష్ణు బ్రహ్మాడులచే సేవింపబడువాడు (54), సర్వప్రాణులకు అధిష్ఠానము, జగత్తును సృష్టించి సంహరించు ప్రభుడు, వికారములులేనివాడు, బ్రహ్మవిష్ణు రుద్రులను త్రిమూర్తులకు ప్రభువు, వినాశము లేనివాడు, సనాతనుడు (55). ఆయనకొరకై దేవతలందరు విచ్చేసి కింకరుల వలె ఈనాడు నీ ద్వారము వద్ద ఉత్సవమును చేయుచున్నారు. ఇంతకంటె గొప్ప సుఖమేమి గలదు? (56) కావున నీవు జాగ్రత్తగా లెమ్ము. నీ జీవితమును సార్థకమును చేసుకొనుము. నన్నీ శివునకు ఇచ్చి నీ గృహస్థాశ్రమమును సఫలము చేసుకొనుము (57).

అమ్మా! నన్ను పరమేశ్వరుడగు శంకరునకు ఇమ్ము. తల్లీ! నేను వినయముతో చెప్పు ఈ మాటను నీవు అంగీకరించుము (58). నీవు నన్ను శివునకు ఈయక పోయినచో నేను మరియొక వరుని వివాహమాడను. ఇతరులను వంచించి జీవించు నక్క సింహమునకు ఉద్దేశించిన భాగమును ఎట్లు పొందగల్గును? (59) తల్లీ! నేను మనోవాక్కాయ కర్మలచే శివుని వరించితిని. ఇది నిశ్చితము. నీకు నచ్చిన తీరున నీవాచరింపుము (60).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


13 Feb 2022

No comments:

Post a Comment