మైత్రేయ మహర్షి బోధనలు - 71
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 71 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 57. మైత్రేయ సంఘము 🌻
చీకటి దారిలో తోడుండిన ప్రయాణమునకు కొంత సుఖ ముండును. జీవితమున స్నేహితుడు కలవాడు అదృష్టవంతుడు. స్నేహమందరికిని లభ్యముకాదు. అదియొక సున్నితమైన సంబంధము. బంధము కాదు. బంధించినది స్నేహము కాదు. చీకటి దారిలో ఎన్నో క్రూరమృగములు తారసిల్లును. వానిని దూరముగ నుంచవలెనన్నచో, భగభగ మండు కాగడావంటి స్నేహితు డుండవలెను. స్నేహమున ఒకరి కింకొకరు కాగడా. చీకటి దారిలో నిద్రా సమయమున ఒకరి కొకరు కాపలా. ప్రయాణమున ఒకరికొకరు తోడు.
జీవన ప్రయాణమున తోడుగ నడచు జీవుడున్నచో కష్టములు, సుఖములు పంచుకొనవచ్చును. ఒకరినొకరు ఓదార్చుకొనవచ్చును. ఒకరినొకరు సంతోషపెట్టవచ్చును. ఒకరినొకరు ప్రోత్సహించు కొనుచు ముందుకు సాగవచ్చును. ఒకరినొకరు కాపాడుకొనుటలో ప్రాణమును, మానమును, ధనమును లెక్కచేయరాదు. అదియే నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన స్నేహము. అట్టి స్నేహితులు సమస్తలోకము లను జయించగలరు. రామలక్ష్మణులు, కృష్ణార్జునులు అట్టివారే. నిజమగు గురుశిష్యులు గూడ అట్టివారే. మిత్రత్వము అత్యంత వైభవోపేతమైన సృష్టిసంపద. ఇది సాధించినవారు మైత్రేయ సంఘ సభ్యులగుదురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
10 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment