మైత్రేయ మహర్షి బోధనలు - 76


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 76 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 62. భయము - అభయము 🌻


భయమును పారద్రోలుట ఉపాధ్యాయుని ప్రథమ కర్తవ్యము. కరుడు కట్టిన విశ్వాసముల వలన భయమేర్పడగలదు. నమ్మినవారిని మోసగించుట వలన భయమేర్పడగలదు. అసత్యములాడుచు కర్తవ్యము నుండి తప్పించుకొనుచు జీవించుట వలన భయ మేర్పడును. భయమునకు కారణము అంతర్ముఖమగు స్వభావమే. భయము ప్రజాపతనమునకు కారణమగును. భయపడువానికి కర్తవ్యమును అందించి దానిని నిరంతరము నిర్వర్తించుట నేర్పవలెను. కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైనవానికి భయమదృశ్యమగును.

భయముచే మ్రింగబడినవాడు కర్తవ్యమును నిర్వహింపలేడు. కావున ఉపాధ్యాయుడు తన వెంట అతని నుంచు కొని తనతోపాటుగ కర్తవ్యములు నిర్వర్తింపచేయుచు దాని యందలి సుఖమును అనుచరున కందించుచుండవలెను. కర్తవ్యోన్ముఖుడైనచో అనుచరుడు భయమును దాటగలడు. తాను కొంత ప్రయత్నించిన మరికొంత సహాయము ప్రకృతి నుంచి అందును. నీటిపై తేలుట నేర్చినవానిని ఎంత పెద్ద అలయైనను ముంచదు గదా! ముంచక ముందుకు కొనిపోవును. అట్లే కర్తవ్యమున నిలచినవానిని భయము ముంచదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


20 Feb 2022

No comments:

Post a Comment