మైత్రేయ మహర్షి బోధనలు - 81


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 81 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 67. వేగము - అవరోధములు 🌻


వేగముగ పోవువానికి ఎదురుగాలి ఎక్కువగ నుండును. సముద్రమున నావ వేగము పెరిగిన కొలది ప్రవాహము ఎదుర్కోలు ఎక్కువగ నుండును. త్వరితగతిని యోగమున పరిణితి చెందు వారికి కూడ జీవితమున విఘ్నములు, కష్టములు ఎక్కువగ నుండును. ఇది ప్రకృతి ధర్మము. త్వరితగతిని పురోగతి చెందుటకు చెల్లించు రుసుము. ప్రత్యేక దర్శనమునకు లేక శీఘ్ర దర్శనమునకు దేవాలయమున ఎక్కువ రుసుము చెల్లించ వలయును గదా! ఇదియును అట్లే.

ప్రసవ వేదనవలె ప్రతి విషయమునను సిద్ధి లభించుటకు కొంత వేదన తప్పనిసరి. సృష్టియందు దీనిని గమనించినవారు వేదనయందిమిడి యున్న ఫలసిద్ధిని తెలియగలరు. అందు వలననే జ్ఞానమను తెరచాపను కాలము, దేశము అను ప్రయాణమున వినియోగించు కొనుచు ముందుకు సాగవలెను. మీరు పఠించిన జ్ఞానమంతయు మీకు కష్ట సమయమున వినియోగ పడుటకే. అట్లుకానిచో జ్ఞానమొక గాడిద బరువగును. విఘ్నముల యందు తెలిసిన జ్ఞానమును వినియోగించుచు ముందుకు సాగుటయే వివేకము.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


28 Feb 2022

No comments:

Post a Comment