🌹. గీతోపనిషత్తు -331 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 27-1 📚
🍀 27-1. ఈశ్వరార్పణము - సమస్తమును ఈశ్వరుడే నడిపించు చున్నాడు. అతడే కర్త, అతడే భోక్త కూడాను. అతని ప్రేరణ వలననే గ్రహమండలములు, సూర్య మండలములు కూడ వర్తించు చున్నవి. ఈశ్వర సంకల్పము లేనిదే చీమ కూడ కదలదు. కార్యములందు సిద్ధి, అసిద్ధి కూడ ఈశ్వరాధీనమై యున్నవి. ఇది భగవంతుని యొక్క నిర్దిష్టమగు సూచన. ఈశ్వరార్పణ బుద్ధితో జీవించమని ఈ సూచన సారాంశము. 🍀
27. యత్కరోషి యదశ్నాసి యజ్జు హోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||
తాత్పర్యము : ఏ పని చేసినను, ఏమి భుజించినను, ఎట్టి హోమములు గావించినను, ఎట్టి దానము లొనర్చినను, ఎట్టి తపస్సులు చేసినను నా కర్పణము చేయుము.
వివరణము : ఇది భగవంతుని యొక్క నిర్దిష్టమగు సూచన. ఈశ్వరార్పణ బుద్ధితో జీవించమని ఈ సూచన సారాంశము. సమస్తమును ఈశ్వరుడే నడిపించు చున్నాడు. అతడే కర్త, అతడే భోక్త కూడాను. అతని ప్రేరణ వలననే గ్రహమండలములు, సూర్య మండలములు కూడ వర్తించు చున్నవి. ఈశ్వర సంకల్పము లేనిదే చీమ కూడ కదలదు. కార్యములందు సిద్ధి, అసిద్ధి కూడ ఈశ్వరాధీనమై యున్నవి. కొన్ని పనులు జరుగుచుండును. కొన్ని పనులు ఎంత ప్రయత్నించినను జరుగవు. అట్లే కొన్నిమార్లు ఫలము లభించును. కొన్నిమార్లు లభింపదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకముగ నుండును.
ఒక రోజు పూజ, ధ్యానము బాగా జరిగినదనిపించును. మరునాడట్లనిపించదు. జీవితమందలి అన్ని విషయము లందు వైవిధ్యము తారసిల్లు చుండును. ఒకనాడు ప్రేమించినవారు మరొకనాడు తటస్టులై యుండవచ్చును. పెంచిన పిల్లలే ఎదురు తిరగవచ్చును. పెంపుడు కుక్కయే కరవవచ్చును. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లు జరుగునో ఎవ్వరునూ ఊహించలేరు. ఓడలు బండ్లగుట, బండ్లు ఓడలగుట, ధనవంతుడు దరిద్రుడగుట, విద్యాహీనులు విద్యా వంతులను శాసించుట, మూర్ఖులు ప్రభువులగుట, ఆరోగ్య వంతులు అకస్మాత్తుగ తీరని అనారోగ్యమునకు గురియగుట ఇత్యాదివి జరుగుచు నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
05 Mar 2022
No comments:
Post a Comment