గీతోపనిషత్తు -341
🌹. గీతోపనిషత్తు -341 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 30 📚
🍀 30-1. శ్రద్ధాభక్తులు - తనయందు, తన పరిసరములయందు నిండి యున్నది, దైవమే అని తెలుయుట రాజవిద్య. దైవమే అనేకానేక మగు రూపాంతరములు చెంది వివిధ రూపములలో, వివిధ గుణములలో ప్రకాశించు చున్నాడని తెలుయుట వలన భేదబుద్ధి లేక పరిసరములను తగురీతిగ సేవించుట యుండును. అనన్యముగ దైవమే యున్నాడు. ఇట్టి సత్యము ఎవరి మనసున నిత్యము ఏర్పడునో అట్టివాడు స్థిరమతి యగును.🍀
అపి చేత్పుదురాచారో భజతే మా మనన్యభాక్ |
సాధురేవ సమంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః || 30
తాత్పర్యము : ఎంత దురాచారు డైనప్పటికిని అనన్య భక్తితో నన్ను సేవించునేని అతడు స్థిరమైన మనసును బొంది క్రమముగ సత్పురుషుడుగ తలంపబడు చున్నాడు.
వివరణము : 9వ అధ్యాయమగు ఈ రాజవిద్య పరమ పవిత్రమైనది. తనయందు, తన పరిసరములయందు నిండి యున్నది, దైవమే అని తెలుయుట రాజవిద్య. దైవమే అనేకానేక మగు రూపాంతరములు చెంది వివిధ రూపములలో, వివిధ గుణములలో ప్రకాశించు చున్నాడని తెలుయుట వలన భేదబుద్ధి లేక పరిసరములను తగురీతిగ సేవించుట యుండును. తల్లిగ గోచరించునది దైవమే. తండ్రిగ గోచరించునది దైవమే. గురువుగ గోచరించునది గూడ దైవమే. సోదర సోదరీమణులుగను, బంధువులుగను, మిత్రుడుగను, శత్రువులుగా కూడ గోచరించు నది దైవమే.
అట్లే పశువులుగను, పక్షులుగను, వృక్షములుగను, పర్వతములుగను, నదులుగను అన్నియు దైవమే. దైవము కాని దేదియు లేదు. అన్యమేదియు లేదు. అనన్యముగ దైవమే యున్నాడు. ఇట్టి సత్యము ఎవరి మనసున నిత్యము ఏర్పడునో అట్టివాడు స్థిరమతి యగును. అట్టి స్థిరమతికి అన్నిట, అంతట దైవమే గోచరించుచు నుండును. కనుక ఆ రూపమున నున్న దైవమును దర్శించి సేవించుట యుండును. ఇట్లు సేవించుట అభ్యాసమైనపుడు మనిషి సాధువగును. అతని ప్రవర్తనమునందలి సాధుత్వము దర్శించిన వారందరునూ అతనిని సత్పురుషునిగనే తలంతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment