గీతోపనిషత్తు -344
🌹. గీతోపనిషత్తు -344 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 31 📚
🍀 31-1. అనన్య భక్తి - అనన్య భక్తులకు సహితము కష్టనష్టములు కర్మవశాత్తు సంభవించ వచ్చును. అయినను అతడు సత్య ధర్మములను వీడడు. పరధనములను, పరస్త్రీలను ఆశించడు. శుచి శౌచము ఎప్పుడునూ కలిగియుండును. అనన్యభక్తిని మించినటువంటి సాధన మరియొకటి లేదు. అట్టి భక్తునికి జ్ఞాన వైరాగ్యములు సహజముగ సిద్ధించును. అట్టి వారి నుండి భగవంతుడు మహత్కార్యములు నిర్వర్తించుచు నుండును. 🍀
31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వ చ్ఛాంతిం నిగచ్ఛతి |
కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి |
తాత్పర్యము : దురాచారుడు సాధువగుట, ధర్మాత్ము డగుట, శాశ్వతమగు శాంతిని పొందుట- అనన్య భక్తిచే శీఘ్రముగ జరుగును. గుర్తుంచుకొనుము. నా భక్తుడు ఎన్నడునూ చెడడు.
వివరణము : ఈ శ్లోకమున అనన్యభక్తి యొక్క ప్రాధాన్యతను విశేషించి భగవానుడు తెలుపుచున్నాడు. అన్య మేదియు లేదని, అంతయు దైవమే అని భావించు పామరుడైనను సహజముగ ధర్మ మార్గమున నడచును. శాంతిని పొందును. అంతయు దైవమే అన్న భావము స్థిరపడినవాడు సహజముగ అహింసను పాటించును. సత్యము ననుసరించును. పరధనములను, పరస్త్రీలను అపహరించడు. కృషి లేని లబ్ధి అంగీకరించడు. శుచి శౌచము కలిగి సంతోషముగ నుండును. సంతోషము కొరకై తాపత్రయ పడక సహజమగు సంతోష ముండును. అట్టి వాడింకెట్లు చెడిపోగలడు?
అందువలన నా భక్తుడు చెడిపోడని, ఇది ముమ్మాటికి సత్యమని భగవంతుడు అత్యంత స్పష్టముగ ప్రకటించుచున్నాడు. అనన్య భక్తులకు సహితము కష్టనష్టములు కర్మవశాత్తు సంభవించ వచ్చును. అయినను అతడు సత్య ధర్మములను వీడడు. పరధనములను, పరస్త్రీలను ఆశించడు. శుచి శౌచము ఎప్పుడునూ కలిగియుండును. అనన్యభక్తిని మించినటువంటి సాధన మరియొకటి లేదు. అట్టి భక్తునికి జ్ఞాన వైరాగ్యములు సహజముగ సిద్ధించును. అట్టి వారి నుండి భగవంతుడు మహత్కార్యములు నిర్వర్తించుచు నుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
31 Mar 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment