గీతోపనిషత్తు -350
🌹. గీతోపనిషత్తు -350 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 32 📚
🍀 32-4. తత్వదర్శనులు - సృష్టి యందున్న బ్రహ్మమును చూచుట ఒకటి, బ్రహ్మము చుట్టును చేరిన ఆవరణలు చూచుట మరియొకటి. బ్రహ్మమును చూచు వాడు బ్రహ్మమై యుండును. నిజమగు జ్ఞానులు తత్త్వదర్శనులై యుందురు గాని, బాహ్యావరణలు చూడరు. అనన్యభక్తి మార్గమున బ్రహ్మప్రాప్తి సత్యమై, నిత్యమై యుండును. అట్టి మార్గమునకు జాతి కుల మత భేదములు లేవు. అట్టి సత్యమిచ్చట ప్రతిపాదింపబడు చున్నది. 🍀
32. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యే2 పి స్యుః పాపయోనయః I
స్త్రియో వైశ్యాస్తథా శూద్రాస్తే పి యాంతి పరాం గతిమ్ ॥
తాత్పర్యము : అనన్యభక్తి మార్గమున నన్నాశ్రయించు వారు నిశ్చయముగ నన్నే పొందుచున్నారు. అట్టివారు స్త్రీలైనను, వైశ్యులైనను, శూద్రులైనను అంతర మేమియు ఉండదు.
వివరణము : ఇట్టి ఆవరణముల కతీతమై జీవుడున్నాడు. అట్టి జీవుడు విజృంభించినచో ఆవరణములు వివశములై జీవుని అనుసరింప వలసినదే. అగ్నికి అవరోధము కలిగించున దేదియు లేదు. ఈ అగ్ని పంచభూతములలో అగ్ని కాదు. అది సహజమగు తేజస్సు. పండితు లనుకున్నవారు, జ్ఞానులనుకొనువారు ఆవరణములే చూతురుగాని, నిజమగు పండితులు, జ్ఞానులు అట్లు చూడరు. నిజమగు జ్ఞానులు తత్త్వదర్శనులై యుందురు గాని, బాహ్యావరణలు చూడరు.
అష్టవంకరలు ఆవరణములకున్నను లోపలి జీవుడు సముడే. అష్టావక్ర మహర్షి కథ అదియే. అతని బాహ్యవంకరలను చూచి హాస్యము చేసిన ఋషులు, రాజ ఋషులు అతనిచే భంగపడిరి. సృష్టి యందున్న బ్రహ్మమును చూచుట ఒకటి, బ్రహ్మము చుట్టును చేరిన ఆవరణలు చూచుట మరియొకటి. బ్రహ్మమును చూచువాడు బ్రహ్మమై యుండును. అనన్యభక్తి మార్గమున బ్రహ్మప్రాప్తి సత్యమై, నిత్యమై యుండును. అట్టి మార్గమునకు జాతి కుల మత భేదములు లేవు. అట్టి సత్యమిచ్చట ప్రతిపాదింపబడు చున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment