గీతోపనిషత్తు -351


🌹. గీతోపనిషత్తు -351 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33 📚

🍀 33-1. కూడి యుండుట - బ్రాహ్మణ క్షత్రియులకు విశ్వాత్మకుడగు దైవమును చేరుటకు వలసిన అవకాశము ఉన్నను వారి అహంకారమే వారిని పరమ గతికి చేరనీయదు. మేధస్సు ఉన్నను అహంకార ముండుట చేత వీరు అన్నిట అంతట యున్న దైవమును దర్శనము చేయుటకు శ్రమించవలసి యున్నది. ఏ జీవునికైనను తనను గూర్చిన భావము మెండుగ నున్నపుడు దైవమును చేరుటకు తానే అడ్డంకిగ నుండును. మేధస్సు కారణముగ జ్ఞాన సముపార్జన చేసి అహంకారు లగుట వీరికి గల అపాయము. 🍀

కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33

తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.

వివరణము : ముందు శ్లోకమున బ్రాహ్మణ క్షత్రియులను గూర్చి భగవానుడు పలుకలేదు. అనన్య భక్తి మార్గమున అందరును తన్ను చేరవచ్చని పలికినాడు. కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు అదే మార్గమున తనను పొంద వచ్చని వేరుగా చెప్పనవసరము లేదని తెలుపు చున్నాడు. బ్రాహ్మణ క్షత్రియులకు విశ్వాత్మకుడగు దైవమును చేరుటకు వలసిన అవకాశము ఉన్నను వారి అహంకారమే వారిని పరమ గతికి చేరనీయదు. నేను బ్రాహ్మణుడనని, నేను క్షత్రియుడనని ఈ జాతుల వారికి అహంకారము మెండుగ నుండును.

మేధస్సు ఉన్నను అహంకారముండుట చేత వీరు అన్నిట అంతట యున్న దైవమును దర్శనము చేయుటకు శ్రమించవలసి యున్నది. ఏ జీవునికైనను తననుగూర్చిన భావము మెండుగ నున్నపుడు దైవమును చేరుటకు తానే అడ్డంకిగ నుండును. మేధస్సు కారణముగ జ్ఞాన సముపార్జన చేసి అహంకారు లగుట వీరికి గల అపాయము. కనుక ఈ ఇరువురికిని పరమును చేరుట ఎంత సులభమో, అంత కష్టము కూడ. ఇదియొక విచిత్ర స్థితి. వీరు ప్రధానముగ జయింపవలసినది వారి అహంకారమునే. వారికి అహంకారము తొలగుటకు వారు నిర్వర్తించవలసినది జీవుల సేవ.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Apr 2022

No comments:

Post a Comment