గీతోపనిషత్తు -355
🌹. గీతోపనిషత్తు -355 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 34 📚
🍀 34-1. జీవేశ్వర సంబంధము - లౌకికమగు సంబంధములు గుర్తించుట కన్న అలౌకికము శాశ్వతము అగు సంబంధము గుర్తించుట శాశ్వతత్వము నిచ్చును. భావము నందు, బాహ్యమునందు ఈశ్వరుని దర్శించుచు నుండుట రాజవిద్య. మనసు దైవమును భావించుట నిజమగు మననము. బయట కనపడుచున్నది దైవమే అని భావించుట కూడ మననమే. ఇట్లు లోపల బయట దైవమునే భావించుట అభ్యసించినపుడు మనస్సునకు ప్రశాంతత చిక్కును. 🍀
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు ।
మా మేవైష్యసి యుక్త్యేవ మాత్మానం మత్పరాయణః || 34
తాత్పర్యము : మనసున నన్నే భావింపుము. అందరి యందు నన్నే దర్శించి సేవింపుము. నన్ను దర్శించుచునే ఎదుటి వానికి నమస్కరింపుము. అన్ని అవస్థల యందు నన్నే కూడి
యుండుము. అపుడు నీవు నేనుగ, నేను నీవుగ ఏకమై యుందుము.
వివరణము : భావమునందు, బాహ్యమునందు ఈశ్వరుని దర్శించుచు నుండుట రాజవిద్య. లౌకికమగు సంబంధములు గుర్తించుట కన్న అలౌకికము శాశ్వతము అగు సంబంధము గుర్తించుట శాశ్వతత్వము నిచ్చును. మనస్సున అనేకానేకమగు, వైవిధ్యమగు భావములు చెలరేగుచు నుండును. భావించుట మనసు ప్రధాన లక్షణము. ఇతర భావనలు, చింతనలు దైవ భావముతో అరికట్టవచ్చును.
మనసు దైవమును భావించుట నిజమగు మననము. బయట కనపడుచున్నది దైవమే అని భావించుట కూడ మననమే. ఇట్లు లోపల బయట దైవమునే భావించుట అభ్యసించినపుడు మనస్సునకు ప్రశాంతత చిక్కును. అట్టి మనసుతో పరిసరము లందలి జీవుల రూపమున నున్న ఈశ్వరుని సేవించుట వలన మనసున పట్టుచిక్కును. ఎట్టి ఆరాధనలు చేయుచున్నను ఈశ్వరునుద్దేశించియే చేయు చుండుట వలన భావమున ఈశ్వరుడే నిలచును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
22 Apr 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment