సిద్దేశ్వరయానం - 66 Siddeshwarayanam - 66

🌹 సిద్దేశ్వరయానం - 66 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵


మధురాబాబు కొద్ది రోజులలోనే పండితసభ ఏర్పాటు చేశాడు. 'అందులో జరిగిన రకరకాల వాద ప్రతివాదాలలో వచ్చిన విద్వాంసులు రెండురకాలుగాను తర్కించారు. భైరవీబ్రాహ్మణి తన వాగ్వైభవమువల్ల పాండిత్యమువల్ల రామకృష్ణ పరమహంస అవతారపురుషుడని శాస్త్రబద్ధంగా తర్కనైపుణ్యంతో వాదించింది. ఆమెనెవరూ కాదనలేకపోయినారు. ఆ విధంగా ఆ సభ ముగిసింది. దీనివల్ల రామకృష్ణుని కీర్తి మరింతగా కలకత్తా నగరం అంతా వ్యాపించింది. ఈ విధంగా కొంత కాలం గడిచిన తరువాత ఒకసారి అందరూ కలిసి రామకృష్ణులవారి స్వగ్రామానికి వెళ్ళారు. అక్కడ వైభవోపేతంగా కాళీ పూజలు ఏర్పాటు చేయబడ్డాయి.

పూజానంతరం సమారాధన జరిగింది. భోజనాలయిన తరువాత భైరవీబ్రాహ్మణి సేవాభావంతో ఎంగిలి విస్తళ్ళను ఎత్తివేసింది. అది చూచిన రామకృష్ణుల మేనల్లుడు హృదయ్ ఆమెను పెద్దగా అవమానకరంగా దూషించాడు. అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల పెద్దలు ఆమె చేసిన పనిని గర్హించారు. ఆ సంఘటనంతా చూస్తూ కూడా రామకృష్ణులవారు ఏమీమాట్లాడలేదు. దానితో ఆయన జీవితంలో తన పాత్ర ముగిసిందని, తానిక నిష్క్రమించవలసిన సమయమాసన్నమైనదని గుర్తించింది. అది లోకసహజమే, కలకత్తా వెళ్ళిన తరువాత రామకృష్ణుల వారితో చెప్పి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. ఆయన కూడా ఉండమని ఏమీ బలవంతం చేయలేదు.

అక్కడి నుంచి మళ్ళీ కొద్ది సంవత్సరాల పాటు దేశసంచారం చేస్తూ కాశీకి వెళ్ళి తన చెల్లెలితో పాటు ఆమె కొన్న గృహములో ఉన్నది. అప్పుడప్పుడు త్రైలింగసామిని చూచి ఆయన ఆశీస్సులు తీసుకొంటూ జప ధ్యానములతో కాలం గడపసాగింది. ఇలా ఉండగా రామకృష్ణులవారు కాశీ వస్తున్నారన్న వార్తవచ్చింది. కొద్దిమందితో కలిసి రాగా, వారందరికి తమ ఇంటిలో వసతి ఏర్పాటు చేసింది. రామకృష్ణులు కొన్నాళ్ళు అక్కడ ఉండి, కాశీలో చూడవలసినవి చూచి తరువాత మళ్ళీ కలకత్తా వెళ్ళి పోయినాడు.

ఈ విధంగా మరికొంత కాలం గడచిన తరువాత కాళీభక్తు డెవరో వచ్చి దగ్గరలో ఉన్న ఒక ధర్మశాలలో బసచేశారని విని ఆసక్తి కొద్ది దర్శిద్దామని వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూస్తే అతడు సుమారు 30, 35 సంవత్సరాల యువకుడు చిన్న నల్లని గడ్డము కొద్దిగా ఉంగరాలు తిరిగి విరబోసిన కేశపాశములు చామనచాయ శరీరము, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు. లోపలికి వెళ్ళి ఆయనను దర్శించగానే, ఆయన కూర్చున్న చోటుకు వెనకాల నిలువెత్తు చిత్ర పటం ఆమెను ఆకర్షించింది. అందులోని కాళీదేవి అచ్చం అరణ్యాలలో తన గురువైన కాళీయోగి స్థాపించిన మూర్తివలె ఉన్నది. అయితే అక్కడిది విగ్రహం, ఇక్కడిది చిత్రము.

తను ఎన్నోచోట్ల కాళీదేవి విగ్రహాలను చూచింది. చిత్రకారులు చిత్రించిన చిత్రాలను చూచింది. కాశీలో శవశివకాళీ మందిరం, అక్కడికి దగ్గరలోని, తారాపీఠములోని కాళి అక్కడికి మరొక వైపున్న కరుణాకాళీ, దయాకాళి తన నెంతో ఆకర్షించినవి. అవి గొప్ప శక్తి కేంద్రాలు. త్రైలింగస్వామి పూజించిన మంగళాకాళి, కీనారాం అర్చించిన హింగుళాకాళి, ఈ కాళీమూర్తులు తనయందు అనుగ్రహం ఎప్పుడూ చూపిస్తునే ఉన్నారు. కానీ ఆమె పూజించిన కళింగారణ్యకాళీ చిత్రం చూడటం ఇదే మెదటిసారి. తన దేవత చిత్రాన్ని ఎవరు గీశారు? ఈయన దగ్గరకు ఎలా వచ్చింది? అందరూ స్వామి అని పిలుస్తున్న ఈ యువకుడు ఎవరు? ఇలా ఆలోచిస్తూ మూతలువడిన కన్నులు తెరిచే సరికి గదిలో ఆ స్వామి, తాను తప్ప ఎవరూలేరు. అందరూ బయటకు వెళ్ళి పోయినారు. సంధ్యా సమయం దాటి చిరుచీకట్లు చిమ్ముతూ, వెలిగించబడిన దీపాలకాంతిలో, ఆ తరుణస్వామి విచిత్ర వ్యక్తిగా భాసిస్తున్నాడు. ఆయనను, ఆ చిత్రంలోని కాళీదేవతను గురించి అడుగుదామని అనుకొంటుండగానే అత డిలా అన్నాడు.

యోగి: యోగీశ్వరీ! నీమనస్సులో కల్లోలిత మవుతున్న సందేహాలు నాకు తెలుసు. కాళీ చిత్రాన్ని గురించి తెలుసుకోవాలని అడుగ బోతున్నావు.

భైరవి: స్వామీ! నా పేరు మీకు ఎలా తెలుసు. నా మనసులోని ఆలోచనలు మీకు ఎలా తెలిసినవి?

యోగి: 50 ఏండ్ల క్రింద బృందావనంలో నా దగ్గరకు వచ్చినపుడు ఇదే ప్రశ్నవేశావు. అప్పుడు నేను, ఏది కావాలంటే అది తెలుసుకోగలను అని చెప్పాను గుర్తుతెచ్చుకో.

( విద్వత్కవిగా ప్రసిద్ధిచెంది ఏవో ఉద్యోగాలలో సద్యోగాలలో కొంత కాలం గడిపి దక్షిణదేశంలోని కుర్తాళ సిద్ధేశ్వరీపీఠాధిపతి దగ్గర సన్యాసం తీసుకొని తరువాత దానికి పీఠాధిపతినై ఉన్నసమయంలో ఇప్పటివలెనే మళ్ళీ అప్పుడు నా దగ్గరకు వస్తావు. అప్పటినీ వివరాలు అప్పుడు నీవు తెలుసుకోగలవు. ఇప్పటి వలెనే గుర్తు చేస్తాను. తపస్వినివై, యోగినివై, ప్రకాశింతువుగాక!)

యోగి: బృందావనం నుంచి బయలు దేరినపుడు నీకొక మాట చెప్పాను. చిన్నతనంలో బిడ్డను తల్లి చెయ్యిపట్టుకొని నడక నేర్పుతుంది. తరువాత తండ్రి చేయిపట్టుకొని విద్యాశాలకు తీసుకు వెడతాడు. వయసు వచ్చిన తరువాత భర్త, చెయ్యి పట్టుకునిజీవితంలో నడిపిస్తాడు. ఆనాడు నీవు రెండవదశలో ఉన్నావని చెప్పాను. రాబోయే జన్మలలో ఏదశలో నాదగ్గరకు వస్తావో! ఎలా వచ్చినా నిన్ను అనుగ్రహిస్తాను.

భైరవి: ధన్యురాలిని, అని స్వామి వారి పాదములకు నమస్కరించింది.


( సశేషం )

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment