🌹 సిద్దేశ్వరయానం - 93 🌹
💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐
🏵 వ్యాయామరంగము 🏵
మరొక రంగము వ్యాయామరంగం. శారీరకంగా బలం సంపాదించాలన్న పట్టుదల నన్ను తాలింఖానాలకు దారి తీసింది. కుస్తీ, వెయిట్ లిఫ్టింగ్, ముష్టియుద్ధం మొదలైన విద్యలలో అధికతరమైన ప్రావీణ్యాన్ని సంపాదించి బహిరంగ బలప్రదర్శనలు చేయడం జరిగింది. అఖిలభారత కుస్తీపోటీలలో అధికారిగా కూడ పనిచేసి విశిష్టగౌరవాలు పొందడం జరిగింది. జీవిత మార్గంలో ఇది ఎంతో ఆత్మవిశ్వాసానికి మూలమయింది. ప్రఖ్యాతమల్లయోధుడు మోచర్ల శ్రీహరిరావు గారు ఈ రంగంలో గురువర్యులు.
🏵 హఠయోగ సాధనలు 🏵
వ్యాయామసాధనల వల్ల అత్యంత బలిష్టమైన శరీరంతో బలప్రదర్శనలు ఇస్తున్న స్థితిలో ఉండగా మనస్సు పూర్తిగా ఆధ్యాత్మికమార్గం వైపు మళ్ళే స్థితి మొదలయింది. తాలింఖానాలో కూడా ఆంజనేయస్వామిని పూజించడం ఆ దేవుని మంత్రాన్ని జపించడం ప్రారంభమయింది. అప్పుడు హనుమాన్ మంత్రాన్ని కొన్ని లక్షలు జపించాను. తరువాత కాలంలో ఇతర సాధనలలో పడి హనుమత్ సాధన కొంత తగ్గింది. మళ్ళీ నాలుగు దశాబ్దాల తరువాత హనుమంతుడు మళ్ళీ జీవితరంగంలోకి ప్రవేశించాడు. ఆ వివరాలు తరువాత తెలియచేస్తాను. శరీరం ద్వారా మనస్సును జయించాలన్న ఆలోచనతో మామూలు ఆహారాన్ని వదిలి వేసి ఆవుపాలు, అన్నము, ఒకటి రెండు కూరలు మాత్రమే తీసుకొంటూ ఉప్పుకారాలు వదిలివేసి కొన్ని సంవత్సరాలు ప్రాణా యామ సాధన చేసాను. ఆసనసిద్ధి సాధించాలన్న పట్టుదలతో ప్రతిరోజూ తెల్లవారుజామున రెండున్నర నుండి మూడుగంటల పాటు శీర్షాసనము వేసేవాడిని. యమ నియ మాసన ప్రాణాయామ మార్గాలలో ఇంకా ముందుకు వెళ్ళాలన్న కోరిక ప్రబలం కావడంతో 'లంబికా' యోగం చేసి ఖేచరీముద్ర సాధించాలన్న కోరిక కల్గింది.
దాని కోసం నాలుక అడుగుభాగంలో ఉండే నరాల పట్టును రోజూ కొంచెం కోస్తూ అది మళ్ళీ అతుక్కొనకుండా అక్కడ సెప్టిక్ కాకుండా చూసుకొంటూ నాలుకను రోజూ సాగతీస్తూ అది పొడుగుగా సాగి వెనకకు మడిచినప్పుడు ముక్కులోనించి వచ్చే రంధ్రం దాకా వెళ్ళగలగాలి. పూర్వకాలంలో కోయడానికి దర్భలు కాని లేక సన్నని కత్తిని కాని ఉపయోగిస్తూ కోసిన చోట కరక్కాయ పొడిని అద్దేవారు. దాని బదులు ఆధునాతన శస్త్రవైద్య విధానాన్ని అనుసరిస్తే తొందరగా పని అవుతుందన్న ఆలోచనతో ఒక నిపుణుడైన శస్త్రవైద్యుని సహకారం తీసుకొని నాలుక అడుగుభాగంలో ఉండేనరాలను అంగిటి వరకు కోయించి క్రింద, పైన కుట్లు వేయించాను. దానివల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది కలిగింది. ఒకటి రెండు రోజులు నాలుక అసలు కదలలేకపోవడం మూలాన మాట యొక్క స్పష్టత తగ్గింది. అతికష్టం మీద కొద్దిపాటి ద్రవాహారంలోపలికి వెళ్ళేది. కొద్దిరోజులకు పుండు మాని నాలుక వెనక్కు బాగా మడవడానికి వీలయింది. ఆ సాధనవల్ల ప్రాణాయామ మార్గంలో చాలా ముందుకు వెళ్ళడం సాధ్యమయింది. అయితే మరొక వైపు మంత్రసాధన, రాజయోగమార్గంలో ధ్యానసాధన చేస్తూ ఉండడం వల్ల ధ్యానసమాధిస్థితి వేగంగా లభించడం అలవాటు అయింది. దానితో నెమ్మదిగా త్రాటకసాధన మిగిలింది. ఒక బిందువును చూస్తూ రెప్పవాల్చకుండా రెండు గంటలు అలా చూస్తూ ఉండేవాడిని. ఇలా చేస్తూ వున్న ఈ శరీరాశ్రిత సాధనలలో విచిత్రమైన అనుభూతులు కల్గినవి.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment