🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 25 🌹
25 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 మనస్సును జయించాలంటే - 1 🍃
152. మనస్సును జయించాలంటే, వివేక వైరాగ్యాలతో దానిని అంతరములోనికి మరల్చి ఆత్మ స్వరూపములో విలీనము చేయాలి. అప్పుడు దాని తిరుగుబాటు ఆగిపోవును. మనస్సును శ్వాసతో అనుసంధానం చేయాలి. శ్వాస నిలిపిన మనసు నిల్చును. ఏ మాత్రము దానిని వదలిన, పులివలే జీవనారణ్యమునందు తిరుగాడుచుండును. శ్వాస నిదానించిన మనస్సు నిదానించను. శ్వాస ఆగిన, మనస్సు ఆగి, ఆత్మ అనుభవమవును.
153. మనస్సును స్వాధీనం చేసుకోనివాడు ధ్యానయోగము, జ్ఞాన యోగము లాంటివి సాధించలేడు. అందుకు దృఢ సంకల్పము, నిష్ఠ, నిరంతర సాధన అవసరము. నిరంతరము దానితో యుద్ధము, ఘర్షణ, పోరాటము సాగించాలి. నిబ్బరము, ఓపికా కలిగి ఉండాలి. ధ్యానమే ధ్యేయమై ఉండాలి.
154. పురాతన యోగులు, గురువులు, సాధకులు, అవధూతలు, ప్రవక్తలు, అవతార పురుషులు బోధించిన సాధనలు మనకు ఉపయోగపడతాయి. వారు సహజ యోగులు అనగా యోగీశ్వరులు.
155. తీవ్ర ముముక్షువైన వానికి ముందుగా సంకల్ప వికల్పములను, వాసనలను క్షయింపచేసిన, అందుకు ధ్యానము, ప్రాణాయామము చేయుట వలన మనస్సు అదుపులో ఉండును.
156. మనస్సుకు, ప్రాణానికి, శ్వాసకు పరస్పర సంబంధం ఉన్నది. శ్వాస, మనస్సులలో ఒకటి కట్టుబడిన రెండోవది అదుపులో ఉంటుంది. శ్వాసను మనస్సుతో ఎంత అదుపులో ఉంచిన అంత ఆయుర్వృద్ధి అగుచుండును.
157. తలంపులు పుట్టిన చోటును గమనించి అచటనే అవి పుట్టకుండా ఆపాలి. దీనినే చిత్త వృత్తి నిరోధము అందురు. మనస్సును మనస్సుతోనే గమనించాలి. మనసుకు మనసునే సాక్షిగా చేయాలి. విలక్షణమైన సాక్షిత్వమే ఆత్మ.
158. సంకల్ప రాహిత్యము, తీవ్ర విచారణ, తత్వ జ్ఞానము ద్వారా వాసనలు నశించి మనస్సు విలీనమై ఆత్మను పొందును. అందుకు నిరంతరము అభ్యాసం చేయాలి.
159. మనస్సను దారము నందు సమస్త ప్రపంచములు, విషయములు, గ్రుచ్చ బడినవి. అట్టి మనస్సను దారము, ఎప్పుడు నశించునో అపుడు విషయపదార్థములు కూడా నశించును. విషయములు మనస్సు కల్పించుకొన్నవే గనుక, మనస్సు నశించిన విషయములుండవు.
160. సంకల్పము కలిగిన వెంటనే గుర్తించాలి. దానిని అచ్చటనే ఆపివేయవలెను. అలా గుర్తించాలంటే మనస్సుతోనే ఆ సంకల్పములను సాక్షిగా గమనించాలి. సంకల్పములు రాని స్థితియే చిత్తవృత్తి నిరోధము.
161. అభ్యాస వైరాగ్యమను పురుష ప్రయత్నం ద్వారా ఇంద్రియ నిగ్రహము, ప్రాణాయామము కూడా అభ్యాసం చేయాలి. మనస్సు వాటికి కట్టుబడి ఉండును.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment