గీతోపనిషత్తు - సాంఖ్య యోగము :- 16. భయము - భదత్ర : -- ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును.


🌹. గీతోపనిషత్ - 16. భయము - భదత్ర : -- ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును., 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 40 📚

నేహాభిక్రమనాశో-స్తి ప్రత్యవాయో న విద్యతే |

స్వల్ప మప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌ || 40

మానవ జీవితమున ప్రస్తుత కాలమున భద్రత లోపించినది. భయమావరించినది. ప్రాథమిక విద్య నేర్చు పసివాని నుండి పరిపాలనము చేయు పరిపాలకుని వరకూ ఎవరును నిర్భీతిగా జీవించుట లేదు.

పిల్లలకు చదువు భయము, యువకులకు వృత్తి - ఉద్యోగ భయము, మధ్య వయస్కులకు అభివృద్ధిని గూర్చి భయము, అధికారులకు పదవీ భయము, ధనకాముకులకు ధన భయము, కీర్తి కాముకులకు అపకీర్తి భయము, అందరికీ అనారోగ్య భయము, జీవితమంతా భయం భయం. ఇవికాక, హత్యలు, మారణ హోమాలు, అభద్రత, వివిధమగు ప్రమాదాలు, యిన్ని యందు దినమొక గండముగ జీవితము సాగుచున్నది. నిస్సహాయుడైన మానవుడు కలియుగము కదాయని, సమస్తమును సరిపెట్టు కొనుచున్నాడు.

భౌగోళికముగా యిప్పుడు భూమికి చక్రవర్తి భయమను పిశాచమే. అది కారణముగా భద్రత ఎండమావిగ భావించబడుతూ యున్నది. కానీ, భద్రపథమును భగవద్గీత సూక్ష్మముగ తెలిపియున్నది. ఆ పథము శాశ్వతముగా భయమును నివారించును.

ఎంత స్వల్పమైననూ, అతి చిన్న దైననూ ఏదో నొక ధర్మమును దైనందినముగ ఆచరించిన జీవునకు ఎంత పెద్ద భయమైననూ నివారణమగును. నిరంతరత్వము, శ్రద్ధాభక్తులు, ఒక ధర్మము ననుసరించుటలో ప్రాప్తించిన జీవునకు సమస్త భయమూ పాపంచలగును.

కలియుగము కటిక చీకటిది. కటిక చీకటిలో చిన్న దీపము కూడ చక్కని వెలుగునిచ్చి దారి చూపును. అట్లే నిరంతరమూ నిర్వర్తింప బడుచున్న చిన్న ధర్మము ఎంతపెద్ద భయము నుండైనా రక్షించగలదు.

''స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌''

అని భగవానుడు వాగ్దానము చేసెను.

దీనిని విశ్వసించి ధర్మమాచరించు జీవునకు భయపడుటకు తావుండదు. భయంకరమగు భయమును అతి స్వల్పమైన ధర్మాచరణ మాలంబనముగా దాటుడు. ఇట్లు మార్గమును సుభద్రము చేసుకొనుడు.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

29.Aug.2020

No comments:

Post a Comment