🌹. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 45 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా వుంది... 2 🌻
“శ్రీశైలంలో తపస్సు చేస్తాను. నంద నామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు, భూమి మీద కొన్ని నక్షత్రాలు రాలిపడతాయి. భూమి గడగడ వణుకుతుంది. అనేకమంది ప్రజలు మరణిస్తారు. శుభ కృత నామ సంవత్సరంలో కార్తీక మాసంలో, దక్షిణ భాగంలో అనేక ఉత్పాతాలు కనబడతాయి. అదే సమయంలో ధూమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది. అందువల్ల అనేకమంది మరణిస్తారు.
నేను సమాధి విడిచి విష్ణు అంశతో కలికి అవతారం ఎత్తుతాను. ప్రమాదినామ సంవత్సరానికి ఎనిమిదేళ్ళవాడినై ఎర్ర బొయీలతో కలిసి వారికి అంతర్య బుద్ధులు కల్పిస్తాను.
అక్కడినుండి శాలివాహనశకం 5407 సంవత్సరము నాటికి, సరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి. కాళయుక్త నామ సంవత్సరం వరకూ, ఉత్తరదేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి. ఆనందనామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమీ గురువారం మల్లిఖార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్యపర్వతానికి చేరతాడు.
రక్తాక్షినామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి, అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి, పట్టాభిషిక్తుడనవుతాను. దుర్ముఖినామ సంవత్సరం, కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకొని, దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను. నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం 4094 అవుతుంది.
నా భక్తులయిన వారును సదా నమ్మి ఓం, హ్రీం, క్ల్రీం, శ్రీం, శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమః అను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటే, వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను’’
పుత్రుడు గోవిందాచార్యుల స్వామికి బ్రహ్మంగారు తెల్పిన భవిష్యత్ శ్రీ వీరబ్రహ్మంగారు, తన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే, మొదటగా శ్రీ బ్రహ్మంగారు విశ్వనాథ అవధూతగా పుడతారు.
ఆ తరువాత ముప్పరంలో స్వర్ణ అమరలింగేశ్వర స్వామిగా, చెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు. ఆ తరువాత వీర భోగ వసంతరాయుల అవతారం.
“నాయనా! నేను కంది మల్లయ్యపల్లె చేరి వీర బ్రహ్మ నామతో యిప్పటి వరకు 175 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పటివరకూ నేను ఈ కలియుగంలోని సామాన్యుల మనస్సులను మార్చి, కేవలం పరబ్రహ్మ ఉపాసకులుగా మార్చగలిగాను.
ఇప్పుడు ఈ బాధ్యతను నీవే స్వీకరించవలసి వుంది. వీరి ఆలోచనలను ఏ విధంగా మార్చగలవో అది నీ యిష్టం. నేను ఈ దినము సమాధి నిష్ఠలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను. నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో.
నీకొక రహస్యాన్ని తెలియజేస్తున్నాను. నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది. ఆమె భూత, భవిష్యత్, వర్తమానములను తెలిసిన బ్రహ్మజ్ఞాని. ఈ కలియందలి మూఢులకు నేనెట్లు మహిమలు చూపానో, ఆమె కూడా అద్భుతములైన మహిమలు ప్రదర్శిస్తుంది.
ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి. చివరికామె ఆ విధంగానే సమాధి నిష్టను పొందుతుంది. నా విధంగానే అంటే ... నాకు ఏ విధంగా మఠములున్నాయో, అదే విధంగా ఆమెకు కూడా మఠములుంటాయి.
నాకే విధంగా పూజలు జరుగుతున్నాయో అలానే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి. ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి వుంది. ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను విను. అతడు ఈశ్వరాంశ సంభూతుడు.
ఈతడు ఒక క్షత్రియుని ఇంత పుట్టి గోహత్య చేయటంవల్ల ఇలా మహమ్మదీయ వంశంలో జన్మించాడు. ఆ గోహత్య పాపపరిహారం కోసమే యిప్పుడు నా సేవకుడయ్యాడు.
🌻. గోవిందమ్మకు జ్ఞాన బోధ 🌻
బోధ వైశాఖ శుద్ధ దశమి, ఆదివారం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలనని వీరబ్రహ్మంగారు ప్రకటించారు.
గోవిందమ్మ విలపించటం ప్రారంభించారు. అప్పుడు గోవిందమ్మను ఉద్దేశించి బ్రహ్మంగారు “నాకు మరణం లేదు, నీకు వైధవ్యం లేదు. నీవు సుమంగళిగా జీవించు. సమాధిని చీల్చుకుని నేను వీరభోగ వసంతరాయులనై భూమి మీద అవతరిస్తాను.
నా ధర్మ పాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను తిరిగి అవతరించే వరకు ఏమేం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను’’ అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కాలజ్ఞానం
29 Aug 2020
No comments:
Post a Comment