🌹 . శ్రీ శివ మహా పురాణము - 209 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
46. అధ్యాయము - 1
🌻. సంక్షేప సతీచరిత్రము - 2 🌻
అభవంస్తేsథ వై సర్వే తస్మిన్ శంభౌ పరప్రభౌ | ఉపాయ నిష్పలాస్తేషాం మమ చాపి మునీశ్వర || 14
తదాsస్మరం రమేశానం వ్యర్థోపాయస్సుతై స్సహ | అబోధయత్స ఆగత్య శివభక్తి రతస్సుధీః || 15
ప్రబోధితో రమేశేన శివతత్త్వ ప్రదర్శినా | తదీర్ష్యామత్యజం సోహం తం హఠం న విమోహితః || 16
శక్తిం సంసేవ్య తత్ర్పీత్యో త్పాదయామాస తాం తదా | దక్షాదశిక్న్యాం వీరిణ్యాం స్వపుత్రాద్ధరమోహనే || 17
ఓ మహర్షీ! పరమాత్మయగు ఆ శంభునిపై నేను, వారు ప్రయోగించిన ఉపాయములన్నియు వ్యర్థమయ్యెను (14).
ఈ రకముగా ఉపాయములన్నియూ వ్యర్థము కాగా, నేను సుతులతో గూడి రమాపతిని స్మరించితిని. అపుడు శివభక్తియందు తత్పరుడు, జ్ఞానియగు ఆ విష్ణువు వచ్చి నా మౌఢ్యమును పోగొట్టెను (15).
శివతత్త్వమును బోధించు రమాపతి నా కళ్లు తెరిపించెను. అపుడు నేను ఈర్ష్యము విడిచి పెట్టితిని. కాని మోహితుడనగు నేను మొండి పట్టును వీడలేదు (16).
అపుడు శక్తిని సేవించి ఆమె అనుగ్రహముచే, శివుని మోహింపజేయుట కొరకై, నా కుమారుడగు దక్షుని వలన వీరిణి అనబడే అశిక్ని యందు ఆమె జనించినట్లు చేసితిని (17).
సోమా భూత్వా దక్షసుతా తపః కృత్వా తు దుస్సహమ్ | రుద్రపత్న్య భవ ద్భక్త్యా స్వభక్తహితకారిణీ || 18
సోమో రుద్రో గృహీ భూత్వాsకార్షీల్లీలాం పరాం ప్రభుః | మోహయిత్వాsథ మాం తత్ర స్వవివాహేsవికారధీః || 19
వివాహ్య తాం స ఆగత్య స్వగిరౌ సూతికృత్తయా | రేమే బహువిమోహో హి స్వతంత్రస్స్వాత్తవిగ్రహః || 20
తయా విహరతస్తస్య వ్యతీయాయ మహాన్మనే | కాలస్సుఖరశ్శంభోర్నిర్వి కారస్య సద్రతేః || 21
తతో రుద్రస్య దక్షేణ స్పర్ధా జాతా నిజేచ్ఛయా | మహామూఢస్య తన్మాయో మోహితస్య సుగుర్విణః || 22
ఆ ఉమాదేవి దక్షుని కుమార్తెగా జన్మించి, దుస్సహమగు తపస్సును భక్తితో చేసి రుద్రునకు పత్ని ఆయెను. ఆమె తన భక్తులకు హితమును కలుగజేయును (18).
పరమేశ్వరుడగు రుద్రుడు ఉమాదేవితో కూడి గృహియై లీలలను ప్రకటించెను. ఆయన బుద్ది యందు వికారములేమియూ ఉండవు. ఆయన తన వివాహముందు నన్ను మోహింపజేసెను (19).
సృష్టిని చేయువాడు, మోహములేని వాడు, స్వతంత్రుడు, స్వేచ్ఛచే రూపమును ధరించిన వాడునగు రుద్రుడు ఆమెను వివాహమాడి, తన పర్వతమును చేరి బహువిధముల రమించెను (20).
ఓ మహర్షీ! వికారములు లేనివాడు, సద్విహారియగు శంభుడు చిరకాలము ఆమెతో కలిసి విహరించుచూ సుఖముగా గడిపెను (21).
అపుడు రుద్రునకు మహామూర్ఖుడు, శివమాయచే మోహితుడు, గర్విష్ఠి అగు దక్షునితో, తన ఇచ్ఛ చేత విరోధము ఏర్పడెను (22).
తత్ర్పభావాద్ధరం దక్షో మహాగర్వి విముఢధీః | మహాశాంతం నిర్వికారం నినింద బహు మోహితః || 23
తతో దక్షస్స్వయం యజ్ఞం కృతవాన్ గర్వితోsహరమ్ | సర్వా నాహూయ దేవాదీన్ విష్ణుం మాం చాఖిలాధిపః || 24
నాజుహావ తథాభూతో రుద్రం రోషసమాకులః |తథా తత్ర సతీం నామ్నా స్వపుత్రీం విధి మోహితః || 25
యదా నాకారితా పిత్రా మాయామోహిత చేతసా | లీలాం చకార సుజ్ఞానా మహాసాధ్వీ శివా తదా || 26
గొప్ప గర్వము గలవాడు, విమోహితమైన బుధ్ధి గలవాడునగు దక్షుడు, మిక్కిలి శాంతుడు, వికార రహితుడునగు శివుని మాయా ప్రభావముచే మిక్కలి మోహితుడై అనేక విధములుగా నిందించెను (23).
అపుడు గర్వితుడగు దక్ష ప్రజాపతి దేవతలను, ఇతరులను, నన్ను, విష్ణువును అందరినీ ఆహ్వానించి శివుడు లేని యజ్ఞమును చేసెను (24).
మాయామోహితుడు, గర్విష్ఠి, రోషముతో కల్లోలితమైనమనస్సు గలవాడునగు దక్షుడు రుద్రుని, సతియను తన పుత్రికను ఆ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (25).
మాయచే విమూఢమైన మనస్సు గల తండ్రి ఆహ్వానించకపోగా, గొప్ప జ్ఞానవతి మహాసాధ్వియగు సతీదేవి లీలను ప్రకటించెను (26).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
29 Aug 2020
No comments:
Post a Comment