భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 96


🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 96  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శంఖలిఖిత మహర్షులు - 2 🌻

7. ఈనాడు మనం కొత్తరకమయిన విజ్ఞానం నేర్చుకున్నాం. సుఖంగానే బ్రతుకుతూ ఉండవచ్చు. లౌకికమైనటువంటి దృష్టితోచూస్తే, “నాకేం లోటండీ! సైన్స్, టెక్నాలజీ, ధనం, సుఖం, వాహనాలు సంపాదించాను” అనవచ్చు. ఇవేమీ మహర్షులకు విరుద్ధంకాదు. వీటికి మహర్షులు దుఃఖపడరు. ఇవి అధర్మం అని వాళ్ళ ఉద్దేశ్యం కాదు.

8. అయితే, అతిథి అభ్యాగతుల విషయంలో ఒక సత్యము, శౌచము, ధర్మము, దేవతలను అనుగ్రహంకోసమని అర్చన చేయటము, దేశభక్తి, ప్రజలయందు ప్రసన్నత, ఇతరులయందు దయ, కష్టపడే వాళ్ళయందు సానుభూతి ఇట్లాంటి మానవధర్మాలెన్నో ఉన్నాయి. ఇవి విస్మరించడమే ధర్మపతనం.

9. పాపమే వృత్తిగా పెట్టుకున్నవాళ్ళ మాట వదిలేస్తే, మనం పాపం చేయకపోయినప్పటికీ, ధర్మాచరణం అనేటటువంటిది-ఆ ఋషులు ఏది ఆచరించారో అది-చెయ్యక పోవటం చేత, వాళ్ళు మన స్మృతిపథంలోంచీ వెళ్ళిపోతున్నారు క్రమక్రమంగా.

10. జీవహింస చేయటంలో మనలో దయాదాక్షిణ్యాలులేవు. మరో ఆలోచనలేకుండా తృణప్రాయంగా నిరాలోచనగానే లక్షల పశువులను చంపగలుగుతున్నాం మనం.

11. కష్టపడుతూ దరిద్రంలో ఉండేవాడిని మనం సానుభూతితో చూడటంలేదు. ‘వాడి కష్టానికి నాకేమయినా బాధ్యత ఉందా? వాడి కష్టాలు తీరటానికి నేనేమయినా చేయాలా?’ ఇట్లాంటి భావనలే పుట్టటంలేదు మనకు. ఎవరిమటుకు వారే, ధనవంతుడు అధిక ధనవంతుడు కావాలని! దానికి పరిమితిలేదు.

12. ‘నేను తృప్తిగా ఉన్నా’ననే భావం ఎవరికీ కలగటంలేదు. ఇటువంటి నేటి భావనలన్నీ ఆర్యధర్మములు కానేకావు. మన ఋషులు మనకు ఏ ధర్మమార్గంలో ఉండమన్నారో, ఆ మార్గానికి సంబంధించిన ధర్మాలలో నేడు మనం అతిక్రమించని ధర్మంలేదు అంటే అతిశయోక్తికాదు.

13. అందువల్ల మరల మన ఋషులను మనం స్మరిస్తే, ధర్మమార్గంలో వెళ్ళేటటువంటి మనోబుద్ధి చిత్తములు అనుగ్రహించమని మనం వారిని అర్థిస్తే, వారు అవి ప్రసాదిస్తారు. వారు దివ్యదేహాలలో ఉన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

29 Aug 2020

No comments:

Post a Comment