కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 23

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 23 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 11 🌻

మోహమునకు ఒక ఉపమానం వుంది. ఎగిరేటటువంటి ఈగ నేల మీద ఉన్నటువంటి శ్లేష్మాన్ని చూస్తుంది. ఎవరో కఫం వచ్చి ఉమ్మేశాడు. అది విసర్జించ బడదగినటువంటి అంశము కాబట్టి వాడు విసర్జించాడు. వీడు విసర్జించినటువంటి కఫము, శ్లేష్మము ఈగకు ఆహారముగా కనబడుతున్నది.

కనబడి ఆ శ్లేష్మము, కఫములో ఉన్నటువంటి సూక్ష్మజీవులని ఆహారంగా పుచ్చుకోవాలని ఈ ఈగ ఆ శ్లేష్మంలో ప్రవేశించింది.

ప్రవేశించేటప్పటికి ఆ శ్లేష్మానికున్నటువంటి జిగురు దాని రెక్కలకంటుకుంటుంది. అంటుకునేటప్పటికి అది ఎగరడానికి అసక్తమైపోతుంది. అసక్తమైపోయి ఆ శ్లేష్మంలోనే పడి చనిపోయింది.

ఇది మోహంలో వున్నటువంటి గొప్ప విశేషం. ధన కనక వస్తు వాహన శరీరగత వ్యామోహములన్నీ ఈ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నిన్ను బయటకి ఎగరనివ్వలేవు. నిన్ను, నీ స్వేచ్ఛని హరిస్తాయి. నీయొక్క మానవజన్మకి సంబంధించిన స్వధర్మాచరణని చేయనివ్వవు.

కాబట్టి ఈ రకమైనటువంటి ఉపమానాన్ని వాటిల్లో వున్న దోషలక్షణాన్ని స్పష్టముగా గుర్తెరగవలసినటువంటి అవసరం వుందనమాట. ఆహా, మరల నేను ఈ రకమైనటువంటి మోహంలో చిక్కుకోబోతున్నాను.

మోహమనే వ్యాఘ్రము బారిన పడబోతున్నాను అన్నారు. పెద్దలేమన్నారంటే మొహాన్ని పులితో పోల్చారనమాట. ఒకసారి పులిబారిన పడినటువంటి వాడు సాధారణంగా తప్పించుకోవడం అనేది సాధ్యపడదు. కారణమేమిటంటే పులి అక్కడా ఇక్కడా పట్టుకోదు.

సరాసరి మెడ దగ్గరే పట్టుకుంటుంది ఏ జీవినైనా సరే. ఇక ఆ మెడ దగ్గర చిక్కినటువంటి జీవి అది తప్పించుకోవడానికి అవకాశము ఉండదనమాట. వీడు తప్పించుకోవడానికి గిలగిలలాడేటంత లోపలే దాని యొక్క పంజా, దాని యొక్క పళ్ళు వీడి యొక్క కంఠనరాలని తెంచేస్తాయి. తద్వారా మృత్యువుబారిన పడతాడనమాట.

కాబట్టి ఈ మొహమనేటటువంటి వ్యాఘ్రము ఎలా వుందయ్యా అంటే నీ ఆయువుని హరించివేస్తూ వుంటుంది. నిరంతరాయముగా నీ ఆయువుని హరించివేస్తుంది. కాలయాపన జరిగేటట్లుగా చేస్తుంది. నిన్ను మేలుకోనివ్వకుండా ఉండేట్లు చేస్తుంది.

నిన్ను విడిపించుకోనివ్వకుండా బంధములో ఉంచేట్లు చేస్తుంది. నిన్ను ఎంత విడిపించుకునేందుకు ప్రయత్నిస్తే అంతగా బిగుసుకుపోయేట్లుగా మార్పుచేస్తుంది. ఈ వ్యామోహం యొక్క ప్రభావం ఇది.

ఆ జన్మాంతర విశేషం అయినటువంటి వాసనాబల ప్రభావము చేత ఏర్పడినటువంటి ఈ మోహము జీవులందరికీ కూడా బంధకారణమై వున్నది. అటువంటి మోహము నుంచి విడిపించుకోవడానికి ఈ ఆత్మజ్ఞానము అత్యావశ్యకము.

ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని ఆత్మవిచారణని పొందుతారో వాళ్ళు ఈ మొహములో నుండి బయటపడతారు. ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటిలో నుండీ బయటపడతారు.

కాబట్టి మానవజన్మని ధన్యత చెందించుకోవాలి అంటే ఉత్తమమైన మార్గము ఆత్మజ్ఞానాన్ని పొందటం. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు నచికేతునకి ఆత్మజ్ఞాన విశేషాన్ని గురించి బోధిస్తూ వున్నాడు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment