🌹 . శ్రీ శివ మహా పురాణము - 225 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 1 🌻
సూత ఉవాచ |
ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో మునిసత్తమః | స ముదోవాచ సంస్మృత్య శంకరం ప్రీతమానసః || 1
సూతుడిట్లు పలికెను -
మునిశ్రేష్ఠుడగు నారదుడు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని, సంతసించిన మనస్సు గలవాడై, శంకరుని స్మరించి ఆనందముతో నిట్లనెను (1).
నారద ఉవాచ |
బ్రహ్మన్ విధే మహాభాగ విష్ణు శిష్య మహామతే | అద్భుతా కథితా లీలా త్వయా చ శశిమౌలినః || 2
గృహీతదారే మదనే హృష్టే హి స్వగృహం గతే | దక్షే చ స్వగృహం యాతే తథా హి త్వయి కర్తరి || 3
మానసేషు చ పుత్రేషు స్వస్వధామసు | సంధ్యా కుత్ర గతా సా చ బ్రహ్మపుత్రీ పితృప్రసూః || 4
కిం చకార చ కేనైవ పురుషేణ వివాహితా | ఏతత్సర్వం విశేషేణ సంధ్యాయాశ్చరితం వద || 5
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! విధీ! మహాత్మా! విష్ణుశిష్యా! మహాప్రాజ్ఞా! నీవు చంద్రశేఖరుని అద్భుత లీలను చెప్పితివి (2).
మన్మథుడు వివాహమాడి ఆనందముతో తన గృహమునకు వెళ్లగా, దక్షుడు తన గృహమును చేరుకొనగా జగత్కర్తవగు నీవు కూడ గృహమును పొందగా (3),
మానసపుత్రులు కూడ తమ తమ ధామములకు చేరుకొనగా, బ్రహ్మ పుత్రి, పితృదేవతలకు తల్లి అగు సంధ్య ఎచటకు వెళ్లెను ? (4)
ఆమె ఏమి చేసెను? ఏ పురుషుని వివాహమాడెను? నీవు సంధ్య యొక్క చరిత్ర నంతనూ విస్తారముగా చెప్పుము (5).
సూత ఉవాచ |
ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మ పుత్రస్య ధీమతః | సంస్మృత్య శంకరం భక్త్యా బ్రహ్మా ప్రోవాచ తత్త్వవిత్ || 6
సూతుడిట్లు పలికెను -
బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడునగు ఆ నారదుని మాటను విని, తత్త్వవేత్తయగు బ్రహ్మ భక్తితో శంకరుని స్మరించి ఇట్లు పలికెను (6)
బ్రహ్మో వాచ |
శృణు త్వం చ మునే సర్వం సంధ్యాయాశ్చరితం శుభమ్ | యచ్ఛృత్వా సర్వకామిన్య స్సాధ్వ్యస్స్యు స్సర్వదా మునే || 7
సా చ సంధ్యా సుతా మే హి మనో జాతా పురాs భవత్ | తపస్తప్త్వా తనుం త్యక్త్వా సైవ జాతా త్వరుంధతీ || 8
మేధాతి థేస్సుతా భూత్వా మునిశ్రేష్ఠస్య ధీమతీ | బ్రహ్మ విష్ణు మహేశాన వచనా చ్చరితవ్రతా || 9
వవ్రే పతిం మహాత్మానం వసిష్ఠం శంసితవ్రతమ్ | పతివ్రతా చ ముఖ్యా భూద్వంద్యా పూజ్యా త్వభీషణా || 10
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! శుభకరమగు సంధ్య యొక్క చరితమును నీవు పూర్తిగా వినుము. ఓ మునీ! దీనిని ఎల్లవేళలా వినే స్త్రీ లందరు సాధ్వీమణులగుదురు (7).
ఆ సంధ్య ముందుగా నాకు కుమారైయై పుట్టెను. ఆమె తపస్సును చేసి, శరీరమును వీడి అరుంధతియై జన్మించెను (8).
బుద్ధి మంతురాలగు ఆమె గొప్ప ముని యగు మేథా తిథికి కుమారైయై జన్మించెను. గొప్ప నిష్ఠ గల ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాటచే (9)
మహాత్ముడు, ప్రశంసింపదగిన తపోనిష్ఠుడునగు వసిష్ఠుని భర్తగా వరించెను. మంచి మనసు గల ఆమె పతివ్రతలలో శ్రేష్ఠురాలై జగత్తునకు నమస్కిరింపదగిన పూజ్యురాలు అయెను (10).
నారద ఉవాచ |
కథం తయా తపస్తప్తం కిమర్థం కుత్ర సంధ్యయా | కథం శరీరం సా త్యక్త్వాsభవన్మేధాతిథే స్సుతా || 11
కథం వా విహితం దేవైర్బ్రహ్మ విష్ణు శివైః పతిమ్ | వసిష్ఠం తు మహాత్మానం సంవవ్రే శంసిత వ్రతమ్ || 12
ఏతన్మే శ్రోష్యమాణాయ విస్తరేణ పితామహ | కౌతూహల మరుంధత్యాశ్చరితం బ్రూహి తత్త్వతః || 13
నారదుడిట్లు పలికెను -
ఆ సంధ్య తపస్సును ఎచట, ఎందుకొరకు, ఎట్లు చేసెను? ఆమె ఎట్లు శరీరమును వీడి మేధాతిథి కుమార్తెగా జన్మించెను? (11)
బ్రహ్మ విష్ణు శివులచే నిర్ణయింపబడిన వాడు, ప్రశంసింపదగిన తపో నిష్ఠ గలవాడు, మహాత్ముడు అగు వసిష్ఠుని ఆమె భర్తగా ఎట్లు వరించెను? (12)
ఓ పితామహా! నేను ఈ అరుంధతీ చరిత్రను విన గోరుచున్నాను ఉత్కంఠ గల నాకు ఈ చరిత్రసారమును విస్తరముగా చెప్పుము (13).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
16 Sep 2020
No comments:
Post a Comment