✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 67
🌻 67. భక్తా ఏకాంతినో ముఖ్యాః || 🌻
ఎవరు కేవలం ప్రేమార్ధమే భగవంతుని ప్రేమిస్తారో వారు ఏకాంత భక్తులు.
భక్తి త్రివిధాలు :
1) బాహ్య భక్తి
(2) అనన్య భక్తి
(3) ఏకాంత భక్తి
1. బాహ్య భక్తి :
ఇది గౌణభక్తి క్రిందికి వస్తుంది. ఈ భక్తి కాయికంగాను, వాచికంగాను ఉంటుంది. సాధనచేత మానసికంగా మార్చుకోవాలి.
ఈ బాహ్య భక్తిలోనే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, సఖ్యం, దాస్యం, అర్చనం, ఆత్మ నివేదనం అని నవ విధాలు. పూజలు, వ్రతాలు, జపతపాలు, క్రతవులు కూడా బాహ్య భక్తి క్రిందకే వస్తాయి. ఈ బాహ్య భక్తి అనన్య భక్తిగా మారాలంటే అందరిలోనూ భగవంతుడిని చూడాలి.
దీనికి చేసే సాధనలో ముందుగా తనకంటే వేరైన వారిని నాలుగు తరగతులుగా విభజించి వారిలో ఒక్కొక్క రకం వారితో 1) ముదిత (2) కరుణ (3) మైత్రి (4) ఉపేక్ష అనే పద్ధతులుగా వ్యవహరించాలి.
ముదిత :
భాగవతోత్తములందు, పుణ్యాత్ములందు, సద్గుణ సంపన్నులందు, ముముక్షువులందు కలిగే సంతోషమే ముదిత.
కరుణ :
దుఃఖమందు, నికృష్ట గుణములున్న వాడియందు, అజ్ఞానులందు కలిగే సానుభూతిని కరుణ అంటారు.
మైత్రి :
దైవ భక్తులందు, ఉపాసకులందు, కర్మిష్టులందు, తనతో సమానమైన గుణములున్న వారితో, వీరంతా నావారు అనే బుద్ధిని మైత్రి అంటారు.
ఉపేక్ష :
పాపాత్ములు, పామరులు, మూర్ఖులు, నీచగుణాలున్న వారు కుటిలులు, దుర్మార్గులు, దుర్వ్యసనపరులందు ద్వేష రహితులై ఉదాసీనంగా ఉండాలి. దీనిని ఉపేక్ష అంటారు.
2. అనన్య భక్తి :
సర్వం భగవత్స్వరూపంగా భావించుకుంటూ అన్య చింతన వదలి మనస్సును తదేక నిష్ఠతో ఏకాగ్రం చేసి భగవంతుని నిరంతరం దర్శించడాన్ని అనన్య భక్తి అంటారు.
3. ఏకాంత భక్తి :
భగవదాకారం పొంది భగవంతుడు భక్తుడు వేరు కానట్టి స్థితిని ఏకాంత భక్తి అంటారు. ఇతడు భాగవతోత్తముడు, సత్పురుషుడు. ఇది ముఖ్యభక్తి క్రిందికి వస్తుంది.
ఏకాంత భక్తిని పతివ్రత యొక్క పతిభక్తితో పోల్చవచ్చును. వీరిలో విశేషమేమంటే వీరు ముక్తిని కూడా కోరరు. వీరు భగవంతుని ప్రేమ కోసమే ప్రేమిస్తారు.
అనపేక్షః శుచిర్ధక్షః ఉదాసీనో గతవ్యధః
సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్సమే ప్రియః
- భగవద్గీత (12:16)
ముఖ్యభక్తుడెవడంటే, ఏ మాత్రం కాంక్ష లేనివాడు, శరీరేంద్రియ మనసులందు శుచియై ఉన్నవాడు, దక్షుడు, పక్షపాత రహితుడు, ఎట్టి దుఃఖాలకు చలించనివాడు, సమస్త కర్మలందు కర్తృత్వాభిమానం లేనివాడు. అట్టి ముఖ్యభక్తుడు నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
16 Sep 2020
No comments:
Post a Comment