🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 55 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 19 🌻
ఈ ఆత్మతత్వాన్ని ఇప్పుడు తెలియబరిచేటటువంటి ప్రక్రియను ప్రారంభిస్తున్నాను. నీవు తెలుసుకొన దలుచు కొనునటువంటి ఆత్మతత్త్వం ఎంతటి విశేషమైనటువంటిదో, ఎలా పొందాలో ఈ రెండింటి లక్షణాలని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట.
‘ఆత్మ’ ఎక్కడ వున్నది? అని అందరి ప్రశ్న. ‘ఆత్మ’ ఎక్కడో ఉన్నది - అనటానికి వీలుకాదు. అంటే ఆకాశం అవతల. పాతాళానికి ఇవతల. ఇలా చెప్పటం కుదరదు. అంటే, “నకర్మణా, నప్రజయా, యద్ధనేనైక, త్యాగేనైక అమృతత్వమానసుః” - అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని ఆత్మ ఉన్నది.
అంటే, ఒకటి చేయడం ద్వారా కానీ, నకర్మణా, నప్రజయా - అనేక జనబాహూళ్యం చేత కానీ, యద్ధనేనైక - ధనబలం చేత కానీ, త్యాగేనైక అమృతత్వమానసుః - ఒక్క త్యాగం చేత మాత్రమే, త్యాగబుద్ధి చేత మాత్రమే ఆత్మ తెలియబడుతుంది. ఎట్లాగు? కారణమేమిటంటే, బుద్ధి గుహయందు వుందట.
అసలు బుద్ధి అనేది ఎక్కడుంది అంటే స్థానం చెప్పడానికి చాలా కష్టమైనటువంటింది. నీ హృదయస్థానంలో నీకు ఆత్మతత్వం నిశ్చలంగా ప్రకాశిస్తూ వున్నది. అట్టి హృదయస్థానాన్ని తెలుసుకోవాలి అనంటే, బుద్ధిపూర్వకంగానే తెలుసుకోవాలి.
బుద్ధిపూర్వకంగా తెలుసుకోవాలి అంటే, నీ ప్రాణమనస్సుల యొక్క చలనం ఎక్కడి నుంచైతే పుడుతోందో, ఆ పుట్టుక స్థానాన్ని నువ్వు ఎప్పటికైనా సరే తెలుసుకోవాలి. సాధనలన్నీ ఈ హృదయస్థానమును తెలుసుకొనటం కొరకే చెప్పబడ్డాయి.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి సూక్ష్మమైనటువంటి, బుద్ధి కంటే సూక్ష్మమైనటువంటి, చిత్తము కంటే సూక్ష్మమైనటువంటి, అహంకారమునకంటే సూక్ష్మమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైన జ్ఞాతగా, తెలుసుకునేవాడుగా, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కూటస్థుడుగా, కదలనివాడుగా, స్థిరముగా, స్థాణువుగా, ఉన్నటువంటి స్థానము, స్థితి ఏదైతే ఉన్నదో, దానిని ‘దుర్ధర్శుడు’ అని పేరుపెట్టారు దీనికి. అంటే అర్థం ఏమిటి?
కష్టసాధ్యమైన వాటిళ్ళోకెల్లా అత్యంత కష్టసాధ్యమైనటువంటి దర్శనం ఏదైనా వుంది అనంటే అది ఆత్మసాక్షాత్కారం. ఈ ప్రపంచంలో హిమాలయాల మీద, ఎవరెస్ట్ పర్వతం మీద ఆత్మ ఉన్నది. అన్నారనుకో మీరందరూ టకటకా టకటకా దానికి తగినట్లు ప్రయాణం పూర్తిచేసుకుని, ట్రైనింగ్ పొంది, ఎవరెస్ట్ పర్వతం ఎక్కి చూస్తారు కానీ, అంత కష్టసాధ్యమైనటువంటి పని కూడా సులభమే కానీ, ‘ఆత్మసాక్షాత్కారజ్ఞానం’ - సులభం కాదు.
అయ్యా! రాకెట్ వేసుకుని చంద్రమండలం మీదకు వెళ్తే, నేను చంద్రమండలం మీద నడిస్తే, ఆత్మ నాకు తెలియబడుతుందా? తెలియబడదు. నువ్వు ఎంతకష్టపడైనా అంతరిక్ష ప్రయాణం పూర్తిచేసినప్పటికీ, ఆత్మానుభూతిని పొందలేవు. అందుకని దీనికి ‘దుర్దర్శుడు’ - అని పేరుపెట్టారు.
ఈ ‘దుర్దర్శుడు’ అన్న పదం చేత మనం స్పష్టంగా తెలుసుకోవలసింది ఏంటంటే, ఇంద్రియముల ద్వారా నువ్వు దీనిని అనుభవించలేవు. అందుకని ఏమంటున్నాడు? ఎట్లా పొందవచ్చటా? ఒకటే మార్గం వుంది. వేరే మార్గం లేదు. ఏమిటి? శబ్దాది విషయముల చేత అది మరుగపరచబడి యున్నది.
‘బుద్ధిగ్రాహ్యమతీంద్రియం’ - అనే స్థితికి బుద్ధి పరిణామం చెందితే తప్ప, వేరే మార్గం లేదు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
16 Sep 2020
No comments:
Post a Comment