శ్రీ శివ మహా పురాణము - 229



🌹 .   శ్రీ శివ మహా పురాణము - 229   🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 
50. అధ్యాయము - 5

🌻. సంధ్య యొక్క చరిత్ర - 5 🌻

కిమర్థ మాగతా భ##ద్రే నిర్జనం త్వం మహీధరమ్‌ | కస్య వా తనయా కిం వా భవత్యాపి చికీర్షితమ్‌ || 50
ఏతది చ్ఛామ్యహం శ్రోతుం వద గుహ్యం న చేద్భవేత్‌ | వదనం పూర్ణచంద్రాభం నిశ్చేష్టం వా కథం తవ || 51

వసిష్ఠుడిట్లు పలికెను -

ఓ మంగళ స్వరూపురాలా! ఈ నిర్జనమగు కొండపైకి ఏల వచ్చితివి? నీవు ఎవరి కుమార్తెవు? నీవు ఏమి చేయ దలచితివి? (50). 

ఇది రహస్యము కానిచో నేను వినగోరు చున్నాను. పున్నమి చంద్రుని వంటి నీ ముఖము అలంకార విహీనము గా ఉన్నది యేల? (51).

బ్రహ్మోవాచ |

తచ్ఛ్రుత్వా వచనం తస్య వసిష్ఠస్య మహాత్మనః | దృష్ట్వా చ తం మహాత్మానం జ్వలంతమివ పావకమ్‌ || 52
శరీరధృగ్‌ బ్రహ్మచర్యం విలసంతం జటా ధరమ్‌ | సాదరం ప్రణిపత్యాథ సంధ్యోవాచ తపోధనమ్‌ || 53

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాత్ముడగు వసిష్ఠుని ఆ పలుకులను విని, అగ్నివలె ప్రకాశించుచున్న ఆ మహాత్ముని చూచి (52), 

మూర్తిదాల్చిన బ్రహ్మచర్య మా యన్నట్లు జటలను ధరించి ప్రకాశించుచున్న ఆ తపోనిష్ఠుడగు వసిష్ఠునకు ఆదరముతో ప్రణమిల్లి, అపుడు సంధ్య ఇట్లు పలికెను (53).

సంధ్యో వాచ |

యదర్థమాగతా శైలం సిద్ధం తన్మే నిబోధ హా | తవ దర్శనమాత్రేణ యన్మే సేత్స్యతి వా విభో || 54
తపశ్చర్తుమహం బ్రహ్మన్నిర్జనం శైలమాగతా | బ్రహ్మణోsహం సుతా జాతా నామ్నా సంధ్యేతి విశ్రుతా || 55
యది తే యుజ్యతే సహ్యం మా త్వం సముపదేశయ | ఏతచ్చికీర్షితం గుహ్యం నాన్యైః కించన విద్యతే || 56
అజ్ఞాత్వా తపసో భావం తపోవనముపాశ్రితా | చింతయా పరి శుష్యేsహం వేపతే హి మనో మమ || 57

సంధ్య ఇట్లు పలికెను -

నేను ఏ ప్రయోజనము నాశించి ఈ పర్వతమునుకు వచ్చి యుంటినో, ఆ ప్రయోజనము సిద్ధించినదని యెరుంగుడు. హే ప్రభో! మిమ్ములను దర్శించుట మాత్రము చేతనే, నాకు ఆ ప్రయోజనము సిద్ధించగలదు (54). 

హే బ్రాహ్మణా!నేను తపస్సును చేయుటకై ఈ జనసంచారము లేని పర్వతమునకు వచ్చి యుంటిని. నేను బ్రహ్మగారి కుమార్తెను. నాకు సంధ్య అనే పేరు ప్రసిద్ధమై యున్నది(55).

 మీకు ఉచితమని తోచినచో, నాకు చక్కగా ఉపదేశించుడు. నేను ఈ తపస్సును రహస్యముగా చేయగోరితిని. దీనికి ఇతరులతో పనిలేదు (56). 

తపస్సును చేయువిధమును తెలియకుండగనే, నేను తపోవనమును చేరుకుంటిని. నేను దుఃఖముతో ఎండి పోవుచున్నాను. నామనస్సు వణుకుచున్నది (57).

బ్రహ్మోవాచ |

ఆకర్ణ్య తస్యా వచనం వసిష్ఠో బ్రహ్మ విత్తమః | స్వయం చ సర్వ కృత్యో జ్ఞో నాన్యత్కించన పృష్టవాన్‌ || 58
అథ తాం నియతాత్మానం తపసేsతి ధృతోద్యమామ్‌ | ప్రోవాచ మనసా స్మృత్వా శంకరం భక్తవత్సలమ్‌ || 59

బ్రహ్మ ఇట్లు పలికెను -

బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడు, తపస్సు యొక్క సర్వకార్యములను స్వయముగా నెరింగినవాడు నగు వసిష్ఠుడు ఆమె మాటను విని ఆమెను ఏమియూ ప్రశ్నించలేదు (58). 

ఆయన భక్తవత్సలుడగు శంకరుని మనస్సులో స్మరించుకొని, నియంత్రింపబడిన దేహేంద్రియమన స్సంఘాతము కల్గినది, తపస్సు కొరకు గొప్ప దీక్షతో ఉద్యమించినది అగు ఆ సంధ్యతో నిట్లనెను (59).

వసిష్ఠ ఉనాచ |

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |పరమః పరమారాధ్యః శంభుర్మనసి ధార్యతామ్‌ || 60
ధర్మార్థ కామ మోక్షాణాం య ఏకస్త్వాదికారణమ్‌ | తమేకం జగతా మాద్యం భజస్వ పురుషోత్తమమ్‌ || 61
మంత్రేణానేన దేవేశం శంభుం భజ శుభాననే | తేన తే సకాలావాప్తి ర్భవిష్యతి న సంశయః || 62
ఓం నమశ్శంకరాయేతి ఓమిత్యం తేన సంతతమ్‌ | మౌనతపస్యా ప్రారంభం తన్మే నిగదతశ్శృణు || 63

వసిష్ఠుడిట్లు పలికెను -

ఎవరు తేజో మూర్తులలో కెల్లా గొప్ప తేజో మూర్తియో, తపస్సులలో కెల్లా గొప్ప తపో మూర్తియో, పూజ్యులలో కెల్లా గొప్ప పూజ్యుడో అట్టి శంభుని మనస్సునందు నిలుపుము (60). 

ధర్మార్థకామ మోక్షములకు ఏకైక ప్రథమ కారణము, జగత్తులకు తండ్రి, పురుషశ్రేష్ఠుడునగు శంభుని సేవింపుము (61).

 ఓ సుందరవదనా! ఈ మంత్రముతో దేవదేవుడగు శంభుని భజింపుము. అట్లు భజించుట వలన నీకు నిస్సందేహముగా కోర్కెలన్నియూ ఈడేరగలవు (62). 

ఓం నమశ్శంకరాయ ఓం అను ఆద్యంతములందు ఓంకారము గల మంత్రమును జపించుము. మౌన తపస్సును నేను చెప్పెదను. నీవు విని, ఆరంభింపుము (63).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment