✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 67 📚
ఇంద్రియాణాం హి చరతాం యన్మనో నువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయు క్నావ మివాంభసి || 67
నీటియందు తేలు నావ గాలిని బట్టి పోవుచుండును. గాలి వాలును బట్టి నావ పలుదిక్కులకు ఈడ్వబడు చుండును కదా! అట్టు పలు విధములుగ ఈడ్యబడుట నావకు ప్రయాణ మెటు కాగలదు?
ముక్కుతాడు వేయని ఎద్దు చేలయందుబడి పంటను విధ్యంసము చేయుచు, చిందులు వేయుచు తినినంత తిని, మిగిలినది పాదములతో త్రొక్కుతూ స్వైర విహారము చేయును. అట్టి ఎద్దు పొలమున కెట్టు ఉపయోగపడ గలదు?
కళ్ళెములేని గుజ్జములతో గూడిన రథము, గుజ్జములెటు లాగినచో అటుపోవును. తత్కారణముగ రథము నశించునుకదా ! శిక్షణము, మావటి లేని మదపుటేనుగు అపాయకరము కదా!
అట్లే రాగద్వేషముల ననుసరించుచు, ఇంద్రియముల ద్యారా ఇంద్రియార్థముల కొరకై పరుగెత్తు మనస్సు మనుజుని హరించును.
నావ పయనించవలె నన్నచో తెరచాప, చుక్కాని ఏర్పరచవలెను. ఎద్దు ఉపయోగపడవలె నన్నచో ముక్కుకు తాడు బిగించి, శిక్షణ నిచ్చి అరక కట్టించవలెను. గుర్రములు ప్రయాణమునకు వినియోగ పడవలెనన్నచో కళ్ళకు గంతలు కట్టి, కళ్ళెము వేసి పగ్గములు పట్టి నడిపించవలెను. మదపుటేనుగు బలము వినియోగ పడవలెనన్నచో అంకుశముతో మావటివాడు అధిష్టించి యుండవలెను.
అట్లే ఇంద్రియములను, మనస్సును అధిష్టించి మానవ ప్రజ్ఞ జీవనయానము వైభవోపేతముగా నిర్వర్తించ దలచుకొన్నచో కర్తవ్యమను అంకుశముతో మనసును నడిపించవలెను. లేనిచో ప్రజ్ఞ హరింపబడునని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment