శ్రీ శివ మహా పురాణము - 240



🌹 .   శ్రీ శివ మహా పురాణము - 240   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ



🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

54. అధ్యాయము - 9


🌻. మారగణములు - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన అనుచరులతో గూడి శివస్థానమునకు వెళ్లగానే, చిత్రమగు వృత్తాంతము జరిగినది. దానిని వినుము (1).

మహావీరుడు, మోహకారకుడు నగు మన్మథుడు అచటకు చేరి వెంటనే తన ప్రభావమును విస్తరింపజేసెను. మరియు ప్రాణులను మోహపెట్టెను (2).

వసంతుడు కూడా శివుని మోహపెట్టుటకై తన ప్రభావమును విస్తరింపజేసెను . ఓమునీ! ఏకకాలములో వృక్షములన్నియు పుష్పభరితములైనవి (3).

మన్మథుడు రతితో గూడి అనేక ప్రయత్నములను చేసెను. జీవులన్నియు వశమైనవి.కాని గణేశుడు, శివుడు వానికి వశము కాలేదు (4).

ఓ మహర్షీ! మన్మథుడు వసంతునితో కలిసి చేసిన ప్రయత్నములన్నియూ వ్యర్థము కాగా, ఆతని గర్వము తొలగి పోయెను. అపుడా తడు నా వద్దకు మరలి వచ్చెను (5).

ఓ మహర్షీ! ఆతడు గర్వము తొలగినవాడై, నిరుత్సాహముతో నుండి నాకు ప్రణమిల్లి గద్గదస్వరముతో నిట్లు పలికెను (6).



మన్మథుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! యోగనిష్ఠుడగు శంభుని మోహింపజేయుట అసంభవము సుమా! నాకు గాని, ఇతరులకు గాని అట్టి శంభుని మోహింపజేయు శక్తి లేదు (7).

హే బ్రహ్మన్‌! నేను నా మిత్రుడగు వసంతునితో, మరియు రతితో గూడి శివుని యందు ప్రయోగించిన ఉపాయములన్నియూ వ్యర్థయమ్యెను (8).

హే బ్రహ్మన్‌! మేము శివుని మోహింపజేయుటకు చేసిన వివిధోపాయములను చెప్పెదను. తండ్రీ! వినుము (9).

శంభుడు ఇంద్రియములను నియంత్రించి సమాధియందుండగా, అపుడు నేను సమాధియందున్న ఆ ముక్కంటి మహాదేవునకు నిరంతరముగా ప్రయత్నపూర్వకముగా చల్లని, వేగముగల, మోహమును కలిగించే, పరిమళభరితమైన వాయువుతో వీచితిని (10.11).

నేను నా అయిదు బాణములను మరియు ధనస్సును చేత బట్టి శివగణములను మోహింపజేయుచూ ఆయన చుట్టు ప్రక్కల తిరుగాడితిని (12).

నేను ప్రవేశించుట తోడనే సర్వ ప్రాణులు నాకు తేలికగా వశమగును. కాని, శివప్రభువు మరియు ఆయన గణములు ఎట్టి వికారమునూ పొందనే లేదు (13).

హే బ్రహ్మన్‌! ప్రమథ గణాధిపతి యగు ఆ శివుడు హిమవత్పర్వత మైదానములకు వెళ్లగా, అపుడు నేను గూడ రతితి, వసంతునితో గూడి అచటకు వెళ్లితిని (14).

ఆ రుద్రుడు మేరు పర్వతమునకు గాని, నాగకేశర (?) పర్వతమునకు గాని, లేదా కైలాసమునకు గాని వెళ్లినప్పుడు నేను కూడా ఆయా స్థలములకు ఆయనను వెన్నంటి వెళ్లితిని (15).

ఎపుడైననూ శివుడు సమాధిని వీడినచో, ఆ సమయములో నేను ఆయన యెదుట చక్రవాక పక్షుల జంటను ప్రదర్శించితిని (16).

హేబ్రహ్మన్‌! ఆ పక్షుల జంట పునః పునః హావభావములను ప్రకటించుచూ ఉత్తమమగు దాంపత్యపద్ధతిని ప్రకటించినవి (17).

గణములతో కూడియున్న, నల్లని కంఠము గల ఆ మహాదేవుని యెదుట మృగములు, పక్షులు శృంగామును ప్రకటించినవి (18).

ఆయన యెదుట మరియు సమీపమునందు నెమలి జంట శృంగారరసమును ఉద్ధీపింపజేయు విధముగా వివిధ గతుల నాట్య మాడినది (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


06 Oct 2020

No comments:

Post a Comment