✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 32 🌻
ఇంకేమిటటా? మనము జన్మతః జననమనే కార్యముతో మొదలుపెట్టి మరణమనే కార్యముతో ముగిస్తూ వున్నాము, శరీర యాత్రని. ఇదొక శరీర యాత్ర. కాని ఆత్మ ఎక్కడికీ ప్రయాణించదు, ఆత్మ ఏ కార్యమూ చెయ్యదు. అది అకార్యము. కార్యమునకు కాదు. ఏ కార్యమునందు ప్రవేశించడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యకపోవడం చేత గానీ నీవు ఆత్మ వస్తువుని తెలుసుకొనజాలవు.
ఇంకా ఏమిటటా? ఈ శరీరం ఒక కాలంలో వుంది. ఒక కాలంలో పరిణమించింది. ఒక కాలంలో పుట్టింది. ఒక కాలంలో పోతుంది. కాబట్టి మూడు కాలములందు భూత భవిష్యత్ వర్తమానములందు పరిణామము చెందుతూ వున్నది. కాని ఆత్మ సర్వకాలములందు ఒక్క తీరుగనే వున్నది కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమానములనేవి లేవు. ఒక కాలమందు వున్నదని, ఒక కాలమందు లేనిదనీ చెప్పుటకు వీలు లేకుండా వున్నది.
ఇంకా ఏమిటటా? ఈ శరీరము పుట్టినప్పుడు చాలా చిన్న రూపముతో వున్నది. తరువాత క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ ఒక స్థాయికి వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తరువాత పరిణామం చెందటం ప్రారంభమయింది. వృద్ధి చెందింది, పరిణామం చెందింది తిరిగి ఏమయింది క్షయించబడుతోంది. క్షీణించబడుతోంది ఒక స్థాయికి వచ్చిన తరువాత. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య అవస్థల ద్వారా వృద్ధి క్షయాలను పొందుతూ వున్నది. కాని ఆత్మకు ఈ వృద్ధి క్షయములు లేవు. దానికెట్టి రూప పరిణామములు లేవు. దానికి నామ రూపములు అంటవు.
ఇంకేమిటటా? పురాతనమైనటువంటిది. పురాతనమంటే ఈ సృష్టికి ముందున్నటువంటి స్థితి నుంచీ సృష్టి మరలా లయించబడి పోయినప్పటికీ మార్పు చెందకుండా వుండేటటువంటిది ఏదైతే వుందో అది ఆత్మ.
కాబట్టి ఎప్పటినించీ వుందయ్యా? ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వున్నది. కాబట్టి పురాణము అనగా అర్ధమేమిటంటే పురాతనమును గురించి తెలియజెప్పునది ఏదో అది పురాణము. పునః ఆయతనః ఇతి పురాతనః. అర్ధమైందా అండి?
పురమునందు ఈ సృష్టి అనేటటువంటి పురమునందు ఆయతనమై అధిష్టానమై ఆశ్రయమై వున్నటువంటి బ్రహ్మము ఏదైతే వున్నదో ఈ శరీరము అనేటటువంటి పురము నందు ఆయతనం ఆశ్రయము అధిష్టానము ఏదైతే అయి వున్నదో అటువంటి ఆత్మ - అటువంటి బ్రహ్మ.
ఇది తెలుసుకోవలసినటువంటి అంశం. ఈ లక్ష్యంలో ఏవైతే చెప్పబడుచున్నాయో వాటికి పురాణములని పేరు. కాబట్టి అష్టాదశ పురాణములకి కూడా లక్ష్యము ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే. పరమాత్మ తత్వ బోధకమే.
కాబట్టి పురాణములన్నీ కూడా భగవద్ విషయముగానే చెప్పబడినప్పటికీ, చెప్పబడిన కధా కధన రీతిలో బేధముండవచ్చునేమో గానీ వాటి యొక్క లక్ష్యార్ధం మాత్రం ఆత్మతత్వమును గ్రహించడం మాత్రమే. అట్లాగే, ఎవరికైతే ఈ శరీరములో వున్నప్పటికీ ఆత్మకు ఏ రకమైన వికారమూ అంటుట లేదు.
ఎలా అంటే ఆకాశములో మేఘములు చలించుచున్నట్లు కనబడుచున్నవి. కాని ఆకాశమును ఏమైనా మేఘములు అంటినయ్యా అంటే అంటలేదు. ఆకాశములో వర్షము మేఘముల ద్వారా ఏర్పడినట్లు కనబడుచున్నది.
కాని ఆ మేఘముల వల్ల ఏర్పడిన వర్షము చేత ఆకాశము తడుపబడుచున్నదా అంటే తడుపబడుట లేదు. అదే ఆకాశమందు అగ్ని స్వరూపము కూడా చలించుచున్నట్లు కనబడుచున్నది. కాని అట్టి ఆకాశము అగ్ని చేత దహించబడుతున్నదా అంటే దహించబడుట లేదు. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
06 Oct 2020
No comments:
Post a Comment