గీతోపనిషత్తు - 46




🌹.   గీతోపనిషత్తు - 46   🌹

🍀  6. ఆరాధనము - దేవతలను ఆరాధించుట యనగా మానవుడు గూడ దేవతల వలె పరహిత ధర్మమునకు తన జీవితమును సమర్పించవలెను. 🍀


✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ



📚.   కర్మయోగము - 11   📚


11. దేవా న్భావయతానేన తే దేవా భావయంతు నః |

పరస్పరం భావయంత: శ్రేయః పర మవాప్స్యథ || 11


శ్రేయః పర మవాప్యుథ :

దేవతలు మానవులకు సహాయము చేయగలరు. దేవతలకు ప్రీతి కలిగించు మార్గము యజ్ఞార్థ జీవనమే. దేవతలు సంతుష్టులైనచో మానవులకు సంతుష్టిని, వృద్ధిని యొసగుదురు. మానవుల వృద్ధికి సహకరింతురు. దేవతలను ఆరాధించుట యనగా మానవుడు గూడ దేవతలవలె పరహిత ధర్మమునకు తన జీవితమును సమర్పించవలెను.

దేవతలట్లే సమర్పించుటచే సృష్టి ప్రణాళిక నెరిగి సృష్టిని నిర్వహణము చేయుచున్నారు. తమవలెనే ఏ మానవుడు పరహిత కార్యములకు సమర్పణ చెందునో అట్టి మానవుడు దేవతల ఆశీర్వచనము పొందును.

శ్రీకృష్ణుడు తెలిపిన భగవధారాధనము యిదియే. స్తుతి కొరకు, స్ఫూర్తి కొరకు ఆరాధనములు సలిపినను పరహితము సలుపని జీవితము జీవులకు హితముగా నుండనేరదు.

దేవతారాధనమనగా పరహితధర్మము నాచరించుట. స్వహితమును ఆశింపకుండుట. ఇది సర్వ శ్రేయోదాయకము. పరమ శ్రేయోదాయకము. పరమ శ్రేయస్సు దీని వలననే కలుగునని “శ్రేయః పర మవాప్యుథ" అని పలికినాడు.

నందగోపుడు వర్షాదులు కురియుటకై ఇంద్రుని ఆరాధించవలెనని సంకల్పించినాడు. బాలకృష్ణుని అడుగగా, ఇంద్రుని ఆరాధన పూజాది కార్యక్రమములుగా కాక, తోటిజీవుల శ్రేయస్సుగా కర్మ నాచరింపుమని బాలకృష్ణుడు తెలిపినాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడిచ్చిన పరమోత్కృష్టమైన ధర్మమిది. అతడు దేవతా ప్రీతికై యజ్ఞ యాగములను, పూజాభిషేకములను, హోమములను తనకుగా తాను ఎన్నడును నిర్వర్తించలేదు. నిర్వర్తిస్తున్న వారిని గౌతమ బుద్ధునివలె ఖండించలేదు. తనను సలహా అడిగినవారికి మాత్రము దేవతారాధన మనగా పరహిత జీవనమే అని తెలియజెప్పినాడు.

దైవమొక్కడే. అతని కార్యమునే దేవతలు చేయుచున్నారు. వారు నిష్కాములు. జీవులు గూడ దేవతలను మార్గదర్శకులుగ నెంచు కొని, ఆ మార్గమునే నడచినచో దివ్యత్వము పొందగలరు.

దేవతలను, గురువులను మార్గదర్శకులుగా భావించుట, గౌరవించుట, పూజించుట తగుమాత్రముగ జరుగుచుండవలెను. అవియే ప్రధాన కార్యములైనచో ముక్తజీవనము దుర్లభము. పరమ శ్రేయస్సునకు పరహితమే పరమధర్మమని శ్రీకృష్ణుడు, శ్రీరాముడు నిర్వర్తించి బోధించినారు.

అదియే సనాతన ధర్మమార్గము. జీవుల శ్రేయస్సే దైవారాధనముగ సాగుట కృష్ణుడు తెలిపిన కర్మబంధ విమోచన మార్గము. (3-11)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


06 Oct 2020

No comments:

Post a Comment