🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 82 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మను తెలుసుకొను విధము -12 🌻
బుద్ధి బలంతో కూడుకున్నటువంటిది, ప్రజ్ఞాబలంతో కూడుకున్నటువంటిది, స్థితప్రజ్ఞత్వాన్ని అందించేటటువంటిది ఏదైతే ఉన్నదో, దానిని విధాయకము అంటారు. అంటే, ధర్మమార్గమును ఆచరించి, మోక్షమార్గమును అధివశించుట. ఇది విధాయక మార్గం యొక్క లక్షణము. రెండవది వుంది, ధారకము.
అంటే అర్థమేమిటంటే అది క్షాత్రము. అంటే, శరీరక బలంతో, వ్యవహార బలంతో, అర్థకామ బలంతో, పురుషార్థములను ధర్మవిహిత రీతిన అర్థకామములను ప్రధానంగా ఆచరించడం. బాహ్యబలాన్ని, శారీరక బలాన్ని, పరిపాలనా బలాన్ని కర్తృత్వాభిమానముతో చేయడం అన్నమాట. అట్లా చేసినప్పుడు అది క్షాత్ర తేజము అవుతుంది. మరి రెండు తేజస్సులు, మానవుని యందు ఎప్పుడూ కూడా ఆవిర్భవించి ఉన్నాయి. బ్రహ్మ తేజము, క్షాత్ర తేజము.
నీకేదైనా వ్యవహారిక రీత్యా సమస్యలు వచ్చినప్పుడు, నీలో క్షాత్ర తేజము ఉప్పొంగుతుంది. పోరాటపటిమ ఉప్పొంగుతుంది. విధిగా పోరాడుతావు. అన్యాయాన్ని ఎదురిస్తావు. ఆ సమయంలో నీలో క్షాత్ర తేజము పనిచేస్తుంది. అయితే ఈ క్షాత్ర తేజంతోటి ఆత్మ వస్తువును అందుకోలేరు. దానికి ఉదాహరణ విశ్వామిత్రుడు.
ఆయన సమస్త భూమండలాధిపత్యాన్ని వహించినటువంటి చక్రవర్తిగా, సమస్త భూమండలాన్ని పరిపాలించినప్పటికి, బ్రహర్షిత్వాన్ని పొందడానికి సమస్తాన్ని త్యాగం చేయవలసి వచ్చింది.
కారణం ఏమిటంటే, తాను చక్రవర్తిని అనే అభిమానం చేత, తాను దివ్యాస్త్ర సంపన్నుడై ఉండడం చేత, తాను సకల శాస్త్ర పారంగతుడనే అభిమానాన్ని పొంది ఉండడం చేత, ఈ రకంగా ఈ బ్రాహ్మమనేటటువంటి తేజము, ఈ క్షాత్రము అనేటటువంటి తేజము, రెండూ కూడా మృత్యుకాలంలో శమించి పోతున్నాయి, నశించిపోతున్నాయి.
అప్పుడూ ఇవి రెండూ పనికి రావడం లేదు. కారణమేమిటంటే, ఈ రెండూ కూడా ఆత్మ తేజస్సు యొక్క స్వయం ప్రకాశజ్ఞానం అయినటువంటి ఆత్మతేజస్సు యొక్క ప్రతిబింబములే కానీ, స్వయం విధాయకములు కావు. స్వయంగా ప్రకాశించగలిగేటటువంటి శక్తివంతములు కావు.
ఈ రకంగా తనలో ఉన్నటువంటి బుద్ధి బలాన్ని, తనలో ఉన్నటువంటి దేహబలాన్ని, తనలో ఉన్నటువంటి ఇంద్రియ బలాన్ని, తనలో ఉన్నటువంటి సాత్విక శక్తులను, తనలో ఉన్నటువంటి రాజసిక శక్తులను, తనలో ఉన్నటువంటి అహంకార అభిమానములను, తాను ఎట్లా త్యజించాలి? తాను ఎట్లా పోగొట్టుకోవాలి. అనేటటువంటి, స్పష్టమైనటువంటి పరిజ్ఞానం కలిగియుండాలి.
అట్లా ఉన్నవాళ్ళు మాత్రమే, సాధన సంపత్తి కలిగినటువంటి వాళ్ళు. సాధన సంపత్తి అంటే అర్థం ఇదేనన్నమాట. కాబట్టి, అట్టి సాధన సంపత్తిని పొందాలి అంటే, తప్పక నీవు ఈ రకమైనటువంటి శక్తిని పొందాలి. సాధన చతుష్టయ సంపత్తి లేకుండా ఇది సాధ్యం కాదు.
కాబట్టి, ప్రతి ఒక్కరూ కూడా సాధన చతుష్టయ సంపత్తిని ఎంత కష్టమైనప్పటికి కూడా చతుర్విధ శుశ్రూషల ద్వారా తప్పక సంపాదించాలి. మానవుడన్న ప్రతీ ఒక్కరూ కూడా ఈ విధిని పాటించాలి.
నిత్యానిత్యవివేకము, ఇహాముత్రార్ధ ఫలభోగ విరాగము, శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనేటటువంటి శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వము ఈ నాలుగు సంపదలను పొందినటువంటి వాడికి ఆ సంపదలకు చోరభయము లేదు.
‘జ్ఞాన రత్నాపహారకః’ - అనేటటువంటి అరిషడ్వర్గములనుంచీ అతడు అధిగమించిన వాడౌతాడు. ఈ అరిషడ్వర్గములనే త్రిగుణ మాలిన్యము, మానవుని యొక్క మనస్సు నందు, బుద్ధినందు, చిత్తము నందు స్థిరముగా వేళ్ళూరుకుని ఉండడం చేత, వ్యవహారము నందు ఈ రకమైనటువంటి బ్రాహ్మీభూతమైనటువంటిది, క్షాత్రభూతమైనటువంటి రకరకాల వ్యవహారిక పద్ధతులను ఆశ్రయించి కర్మమార్గములో పడవేయుచు జ్ఞానమార్గము నుంచి దూరము చేస్తాయి.
కాబట్టి, ప్రతి ఒక్కరూ కేవల జ్ఞానపద్ధతిని ఆశ్రయించినప్పుడు మాత్రమే, ఈ ఆత్మానుభూతిని, ఈ బ్రహ్మానుభూతిని, బ్రహ్మనిష్ఠను, పరబ్రహ్మనిర్ణయమును పొందగలుగుతారు. కాబట్టి, అటువంటి కేవల జ్ఞాన పద్ధతిని తప్పక మనము ఆశ్రయించాలి.
(సృష్టి స్థితి లయములు ఏ ఆత్మయందు జరుగుచున్నవో అట్టి ఆత్మ కూపస్థమండూకము. ఇతర ప్రపంచమెరుగనట్లు ప్రాకృత బుద్ధిగల అజ్ఞానులు ఆత్మను ఎఱుగజాలరు. సాధన సంపత్తి గల బ్రహ్మజ్ఞానులే ఆత్మను పొందగలరు.) - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam
https://www.facebook.com/groups/465726374213849/
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel 🌹
https://t.me/Spiritual_Wisdom
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithadevi
23 Oct 2020
No comments:
Post a Comment