సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకోండి!


🌹. సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకోండి! 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్‌,

📚. ప్రసాద్ భరద్వాజ


జాతీయత, ప్రాంతీయత, స్వీయ వ్యక్తిగత చరిత్రలకు బందీ కాకుండా నేను అనేక సంవత్సరాలుగా అద్భుతమైన స్వేచ్ఛానుభూతిలో జీవిస్తున్నాను. అయినా ఆ అనుభూతిలో ఏదో బాధకూడా ఇమిడి ఉంది. ఈ బాధ ఏమిటి?

స్వేచ్ఛకు రెండు పార్శ్వాలుంటాయి. వాటిలో ఒక పార్శ్వం మాత్రమే మీ అనుభవంలోకి వస్తే ఆ స్వేచ్ఛలో ఏదో బాధ కూడా ఉన్నట్లు మీరు భావిస్తారు. కాబట్టి, స్వేచ్ఛ మనస్తత్వాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి.

స్వేచ్ఛకున్న రెండు పార్శ్వాలలో మొదటిది ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’. అంటే, జాతి, జాతీయత, చర్చి, రాజకీయ భావజాలాలనుంచి స్వేచ్ఛ. స్వేచ్ఛ మొదటి పార్శ్వం, దాని పునాది ఇదే. అలాంటి స్వేచ్ఛ ఎప్పుడూ ఏదో ఒక దాని నుంచి వస్తుంది. ఒకసారి అలాంటి స్వేచ్ఛ మీకు లభించగానే మీకు చాలా హాయిగా, తేలికగా, సంతోషంగా ఉంటుంది.

ఎందుకంటే, వాటి ముసుగులో ఉన్న మీ వ్యక్తిత్వానికి ఒక్కసారిగా స్వేచ్ఛ లభించడంతో తొలిసారిగా మీరు మీ స్వీయ వ్యక్తిత్వంలో ఆనందించడం ప్రారంభిస్తారు. ‘‘దేనినుంచో స్వేచ్ఛ’’ మీకు లభించింది. అందుకే మీలో ఆ ఆనందం. కానీ, అది సగం స్వేచ్ఛ మాత్రమే.

మిగిలిన సగం ‘‘దేనికోసమో స్వేచ్ఛ’’. ఇది మీకు దక్కలేదు. అదే మీలోని బాధ.

‘‘దేని కోసం స్వేచ్ఛ?’’అనేది లేకపోతే స్వేచ్ఛకు పూర్తి అర్థం లేనట్లే. సృజనాత్మకతకు అవకాశమున్న ఏదో ఒక దాని కోసం- శిల్పం చెక్కాలన్నా, నాట్యం చెయ్యాలన్నా, సంగీతం పాడాలన్నా, కవిత్వం రాయాలన్నా, వర్ణచిత్రాలు వెయ్యాలన్నా- మీకు స్వేచ్ఛకావాలి.

మీ స్వేచ్ఛ సృజనాత్మక జ్ఞానంగా మారనంత వరకు మీకు బాధ తప్పదు. ఎందుకంటే, బంధనాలు తెంచుకుని బందిఖానా నుంచి బయటపడి కటిక చీకటిలో పూర్తి స్వేచ్ఛతో నిలబడ్డ మీకు ఎక్కడికి వెళ్ళాలో, ఏ దారిలో వెళ్ళాలో తెలియదు. అందుకే మీకు వెంటనే బాధ కలుగుతుంది.

ఇంతవరకు మీరు జైలులో ఉన్నారు కాబట్టి, ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం మీకు రాలేదు. పైగా, మీ చైతన్యం అందులోంచి బయటపడాలని తపించి పోయింది. ఇప్పుడు మీరు అందులోంచి బయటపడ్డారు. మీకు పూర్తి స్వేచ్ఛ దక్కింది. అయినా మీకు ‘‘ఇప్పుడేం చెయ్యాలి?’’ అనే కొత్తరకం సమస్య తలెత్తింది.

కాబట్టి, మీరు సృజనాత్మకత మార్గాన్ని ఎంచుకునే వరకు మీకు దక్కిన స్వేచ్ఛకు అర్థముండదు. ఆత్మజ్ఞానం కోసం మీరు గాఢమైన ధ్యానంలోకి వెళ్ళండి లేదా మీకు నాట్యం చేసే ప్రతిభ ఉంటే నర్తకునిగా మారండి. అప్పుడే మీ స్వేచ్ఛకు సంపూర్ణత్వం సిద్ధించి వృత్తం పూర్తవుతుంది.

కేవలం సంకెళ్ళ కారణంగా మీ చేతులు సంగీతాన్ని సృష్టించ లేకపోయాయి. మీ కాళ్ళు నాట్యం చెయ్యలేక పోయాయి. అందుకే మీ ప్రతిభ అభివృద్ధి చెందలేదు.

తొలిసారి స్వేచ్ఛకోసం పోరాడే వ్యక్తి ‘‘దేనినుంచో స్వేచ్చ, దేనికోసం స్వేచ్ఛ’’అనే గందరగోళంలో పడక తప్పదు. అందుకే అతనికి స్వేచ్ఛ లభించగానే ‘‘ఇప్పుడేం చెయ్యాలి?’’ అనిపిస్తుంది.

ఎందుకంటే, ఇంతవరకు అతను పోరాడే పనిలో ఉన్నాడు. చివరికి అతని కలల్లో కూడా స్వేచ్ఛ గురించిన ఆలోచనలే. అందుకే ‘‘స్వేచ్ఛ లభించిన తరువాత ఏం చెయ్యాలి?’’అనే దాని గురించి అతను ఎప్పుడూ ఆలోచించలేదు. అయినా ఇంకా ఏదో కావాలి. మీరు సృజనాత్మకునిగా మారాలి. మీ స్వేచ్ఛ సఫలీకృత మయేందుకు మీరు ఏదో ఒకటి సృష్టించాలి. లేకపోతే, ఆ స్వేచ్ఛ ఏమీలేని శూన్యమవుతుంది.

మీరు ఏదో ఒకటి సృష్టించడమో, ఆవిష్కరించడమో లేదా మీ సామర్థ్యానికి వాస్తవరూపాన్ని తీసుకురావడమో లేదా మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు మీరు మీ అంతర్గతంలోకి ప్రయాణించడమో చెయ్యవలసిన అవసరముంది. అందుకు మీకున్న స్వేచ్ఛతో మీరు ఏదో ఒకటి చెయ్యాలి.

మీరు చెయ్యాలనుకున్నది చేసేందుకు స్వేచ్ఛ మీకు చక్కని అవకాశాన్నిస్తుందే కానీ. అదే దాని లక్ష్యం కాదు. మీరు స్వేచ్ఛగాఉన్నా బాధపడుతున్నారు. ఎందుకంటే, మీకు దక్కిన అవకాశాన్ని మీరు సరిగా వినియోగించుకోలేదు.

కాబట్టి, ఊరికే కూర్చోకుండా మీకున్న స్వేచ్ఛతో మీరు ధ్యానం చెయ్యండి. సంగీతం పాడండి. శిల్పాలు చెక్కండి. వర్ణ చిత్రాలు వెయ్యండి, నాట్యం చెయ్యండి. ప్రేమించండి లేదా ఏదో ఒకటి చెయ్యండి. లేకపోతే మీకు బాధ తప్పదు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2021

No comments:

Post a Comment