నిర్మల ధ్యానాలు - ఓషో - 10


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 10 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనిషి తన సంకల్పాన్ని దాటి వెళ్ళాలి. అప్పుడే తను దైవ సంకల్పంలో భాగమవుతాడు. 🍀


వ్యక్తి తన సంకల్పాన్ని వదులుకోవాలి. అసలు యిబ్బందంతా అక్కడే వుంది. ఒకసారి మన సంకల్పాన్ని వదులుకుంటే అపుడు మన గుండా అస్తిత్వం తన పనిని మొదలు పెడుతుంది. అప్పుడక్కడ బాధ వుండదు. దు:ఖముండదు. అత్యుత్సాహముండదు. ఉద్వేగముండదు. వ్యక్తి సంపూర్ణ విశ్రాంతితో వుండవచ్చు. అక్కడ సమస్యే వుండదు.

అన్ని సమస్యలూ నీ సంకల్పం నించే మొదలవుతాయి. సంకల్పమంటే సమస్తానికి వ్యతిరేకంగా సంఘర్షించడం. అది ఘర్షణే. సంఘర్షణ ఆందోళనకి కారణమవుతుంది. అపుడు నీకు వైఫల్యమే ఫలితం.

అందువల్ల ఎంత పెద్దగా ఘర్షించినా ప్రతివాడికీ హృదయపు లోతుల్లో దాని వల్ల ఫలితం వుండదని తెలుస్తునే వుంటుంది. వ్యక్తి సమస్తానికి వ్యతిరేకంగా నిలిచి విజయం సాధించలేడు.

సమస్తంలో కలిసి వుంటే మనిషి సాధించగలడు. సమస్తానికి వ్యతిరేకంగా వుంటే ఏమీ సాధించలేడు. ఒకసారి నువ్వు నీ సంకల్పాన్ని వదులుకుంటే అన్నీ నీవే హఠాత్తుగా అనంత విశ్వం నీకోసం తలుపులు తెరుస్తుంది. అన్ని రహస్యాలూ నీకు అవగతమవుతాయి. తెలియనివన్నీ నీకు తెలిసివస్తాయి. అన్ని తాళాలు నీ చేతి కందుతాయి.

ఇక్కడ వున్న విరోధాభాస ఎట్లాంటిదంటే ఒకసారి నీ సంకల్పాన్ని నువ్వు వదులుకుంటే నువ్వు అధికారివవుతావు. అట్లా కాకుండా నీ సంకల్పాన్ని వదులుకోకుండా నువ్వు సంఘర్షిస్తూ వుంటే నువ్వు బానిసగానే మిగిలిపోతావు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


29 Apr 2021

No comments:

Post a Comment