గీతోపనిషత్తు -181


🌹. గీతోపనిషత్తు -181 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 22

🍀 22. ఆత్మరతి - నిశ్చలస్థితి స్థితి యందు స్థిరపడునటు వంటి యోగిని ఎంతటి దుఃఖమైనను విచలనము కలిగించలేదు. చిత్తము ఇంద్రియ ప్రవృత్తులనుండి నిరోధింపబడి, నేను అను వెలుగును అంతర్ముఖముగ దర్శించుచు, ఆ వెలుగునందు రమించుచు, స్థిరముగ నిలచి, ఆద్యంతములు లేని నిష్కారణమగు సుఖము అనుభవించుట నేర్చినపుడు, ఇక యితర విషయము లందు ఆసక్తిగొనుట కష్టము. అంతరానందము వృద్ధి కలిగిన యోగికి ఇతరమగు విషయము లేవియు తత్తుల్యమగు ఆనందమును కలిగించలేవు. అంతకు మించిన ఆనందము ఉన్నదని చెప్పినను అతడు విశ్వసింపడు. ఆత్మరతి కన్న ఆనందము కలిగించు విషయ మేముండ గలదు? 🍀

లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే || 22



పై విధముగ నిశ్చలస్థితి యందు నిలచి 'నేను-తాను' అను వెలుగును దర్శించు యోగికి కలుగు ఆత్యంతికమగు సుఖమును మించిన సుఖము మరియొకటి యుండదు. అట్టి స్థితియందు స్థిరపడునటు వంటి యోగిని ఎంతటి దుఃఖమైనను విచలనము కలిగించలేదు. చిత్తము ఇంద్రియ ప్రవృత్తులనుండి నిరోధింపబడి, నేను అను వెలుగును అంతర్ముఖముగ దర్శించుచు, ఆ వెలుగునందు రమించుచు, స్థిరముగ నిలచి, ఆద్యంతములు లేని నిష్కారణమగు సుఖము అనుభవించుట నేర్చినపుడు, ఇక యితర విషయము లందు ఆసక్తిగొనుట కష్టము. అట్లని యోగికి అనాసక్తి యుండదు.

బాహ్యమున కర్తవ్యమును నిర్వర్తించుచు, విరామము చిక్కు నపుడెల్ల అంతర్ముఖుడై, అంతరానందము చెందుచు నుండును. అంతరానందము వృద్ధి కలిగిన యోగికి ఇతరమగు విషయము లేవియు తత్తుల్యమగు ఆనందమును కలిగించలేవు. అంతకు మించిన ఆనందము ఉన్నదని చెప్పినను అతడు విశ్వసింపడు. ఆత్మరతి కన్న ఆనందము కలిగించు విషయ మేముండ గలదు? కావున ఇతర సుఖములుగాని, దుఃఖములుగాని అతని స్థిర చిత్తమునకు చికాకు కలిగింపలేవు.

సనక సనందనాదులు, నారదుడు, ప్రహ్లాద అంబరీషులు, బృందావనమందలి గోపికలు ఇట్టి ఆనందమునే రుచి చూచిరి. వారికి త్రిభువనములు కన్న ఆత్మరతియే ఆనందదాయకము. ఈ రుచులు గొన్న బలిచక్రవర్తి తన సమస్తమును, తనను దైవదత్తము గావించి బ్రహ్మానందమున నిలచెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Apr 2021

No comments:

Post a Comment